Begin typing your search above and press return to search.

అక్క‌డ జుట్టు క‌త్తిరిస్తోంది దెయ్య‌మేనా?

By:  Tupaki Desk   |   4 Aug 2017 9:42 AM GMT
అక్క‌డ జుట్టు క‌త్తిరిస్తోంది దెయ్య‌మేనా?
X
దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌హా ఆ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ - మ‌ధ్య‌ప్రదేశ్ - హ‌ర్యానా - రాజ‌స్థాన్‌ రాష్ట్రాల్లో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు, ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. రాత్రి వేళ‌ల్లో త‌మ ఇళ్ల‌ల్లోనే నిద్రిస్తున్న ప‌లువురు యువ‌తుల జుత్తు తెల్లారేస‌రిక‌ల్లా మాయ‌మైపోతోంద‌ట‌. ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తిస్తున్న కార‌ణంగానే త‌మ జుత్తు మాయ‌మైపోతోంద‌ని చెబుతున్న స‌ద‌రు బాధితులు.. అంద‌మైన జుత్తు రాత్రికి రాత్రే మాయ‌మైపోవ‌డంతో ల‌బోదిబోమంటున్నారు. అయితే ఇదేదో మ‌నుషులు చేస్తున్న ప‌ని కాద‌ని, దెయ్యాలు చేస్తున్న ప‌నేన‌నంటూ స‌ద‌రు బాధితుల గ్రామ‌స్థులు కొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఆ మూడు ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. వెర‌సి ఇప్పుడు ఉత్త‌రాది భార‌తాన్ని ఈ జుట్టు దెయ్యం వ‌ణికిస్తోంద‌నే చెప్పాలి.

వివ‌రాల్లోకెళితే... ఆగ్రా సమీపంలో ఓ గ్రామంలో ఇటీవ‌ల వ‌రుస‌గా ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆ గ్రామంలో మానసిక స్థితి సరిగాలేని ఓ మహిళను మంత్రగత్తెగా భావించి గ్రామస్తులు కొట్టి చంపారు. ఇప్పుడు ఆమె దెయ్యంగా మారి జుట్టు కత్తిరిస్తోందని ప్రజలు భయపడుతున్నారు. ఫిరోజాబాద్‌ జిల్లా అమరి గ్రామంలో పిండీ అనే అమ్మాయి - అదే జిల్లా జాస్నారా గ్రామంలో శివాని అనే యువతి జుట్టును బుధవారం రాత్రి ఎవరో కత్తించారని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. అలాగే ఆగ్రాలో ఓ పూజారి భార్య జడను, మరో వివాహిత జుట్టును కూడా కత్తిరించారు.

జుట్టు కత్తిరింపుకు గుర‌వుతుండటం నిజమేననీ, దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే కనిపెడతామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలపై యూపీ సర్కిల్‌ ఆఫీసర్‌ తేజ్‌ వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రజలు వదంతులను నమ్మవద్దని, విచారణ కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు హర్యానా - రాజస్థాన్‌ లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు నిద్రిస్తున్న సమయంలో వారి జట్టు కత్తిరింపుకు గురి కావడంతో వారు రక్షణ కోసం మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం విచారణ జరుగుతోందని, మూఢ నమ్మకాలతో మంత్రగాళ్లను సంప్రదించవద్దని చెబుతున్నారు.