Begin typing your search above and press return to search.

రాయిట‌ర్స్ జ‌ర్న‌లిస్టుల‌కు ఏడేళ్లు జైలు.. !!!

By:  Tupaki Desk   |   4 Sep 2018 5:11 AM GMT
రాయిట‌ర్స్ జ‌ర్న‌లిస్టుల‌కు ఏడేళ్లు జైలు.. !!!
X
పాల‌కుల దుర్నీతిని బ‌య‌ట‌పెట్టే పాత్రికేయుల‌కు అపాయం పొంచే ఉంటుంది. తాజాగా రాయిట‌ర్స్ జ‌ర్న‌లిస్టుల‌కు మ‌య‌న్మార్ కోర్టు ఏకంగా ఏడేళ్ల జైలుశిక్ష‌ను విధించింది. ఇంత‌కూ వారు చేసిన త‌ప్పేమిటంటే.. ఆ దేశంలోని ముస్లింల‌పై సాగిన ఊచ‌కోత‌ను వివ‌రాల‌తో స‌హా ప్ర‌పంచానికి వెల్ల‌డించ‌ట‌మే.

గ‌త ఏడాది ఆగ‌స్టులో అరాక‌న్ రోహింగ్యా సాల్వేష‌న్ ఆర్మీకి చెందిన కొంద‌రు ఉగ్ర‌వాదులు మ‌య‌న్మార్ లోని ర‌ఖైన్ రాష్ట్రంలోని పోలీస్ స్టేష‌న్లు.. ఆర్మీ కేంద్రాల‌పై దాడికి పాల్ప‌డ్డారు. దీంతో.. ఉత్ర‌వాదుల్ని ఏరివేసే పేరుతో మ‌య‌న్మార్ సైన్యం ఆరాచ‌కాల‌కు పాల్ప‌డింది. రోహింగ్యాల్ని ఊచ‌కోత ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో ఏడు ల‌క్ష‌ల‌కు పైగా రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని బంగ్లాదేశ్‌ కు పారిపోయారు.

ఇదే సంద‌ర్భంలో ర‌ఖైన్ లోని ఇన్ డిన్ అనే గ్రామంలో ప‌ది మంది అమాయ‌కుల్ని మ‌య‌న్మార్ సైన్యం కాల్చి చంపిన వైనాన్ని రాయిట‌ర్స్ జ‌ర్న‌లిస్టులు వా లోన్ (32).. కా సో ఓ (28) ప్ర‌పంచానికి వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత వారో విందు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా.. ఓ పోలీసు అధికారి వారికి కొన్ని ప‌త్రాల్ని ర‌హ‌స్యంగా ఇచ్చారు. ఆ వేడుక నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశ ర‌హ‌స్యాల‌ను లీక్చేస్తున్నార‌ని.. అధికారిక ర‌హ‌స్య‌ల చ‌ట్టాన్ని ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వారిని అరెస్ట్ చేసి అభియోగాలు మోపారు.తాజాగా దీనికి సంబంధించిన కేసు విచార‌ణ జ‌రిగింది. వారిపై మోపిన అభియోగాల్నినిజ‌మ‌ని తేల్చిన అక్క‌డి కోర్టు వారిద్ద‌రికి ఏడేళ్లు జైలుశిక్ష విధిస్తూ సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించారు. ఈ తీర్పుపై రాయిట‌ర్స్ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ స్టీఫెన్ జె. అడ్ల‌ర్ స్పందిస్తూ.. మీడియా నోరు మూయించేందుకే.. భ‌య‌పెట్టేందుకు మయ‌న్మార్ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య తీసుకుంద‌న్నారు. ఇక‌.. జైలు శిక్ష‌కు గురైన జ‌ర్న‌లిస్టులు మాట్లాడుతూ.. తాము ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటామ‌ని పేర్కాన్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లుదేశాలు ఈ చ‌ర్య‌ను ఖండించాయి. వీరిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని మ‌య‌న్మార్ కు సూచించాయి.