Begin typing your search above and press return to search.

హాట్‌ టాపిక్‌.. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం కుమారుడి భేటీ!

By:  Tupaki Desk   |   4 July 2023 11:28 AM GMT
హాట్‌ టాపిక్‌.. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం కుమారుడి భేటీ!
X
ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందినవారు వేర్వేరు పార్టీల వైపు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా రెండు పార్టీల నుంచి గెలవవచ్చని భావిస్తున్నారు. లేదా తమ కుటుంబంలో ఎవరో ఒకరు గెలుస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన బూడి ముత్యాల నాయుడు కుమారుడు రవి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి బూడి ముత్యాల నాయుడు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ రెండో విడత కేబినెట్‌ లో డిప్యూటీ సీఎంగా పదవిని దక్కించుకున్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ బూడి ముత్యాల నాయుడు మాడుగుల నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. కాగా ఆయన కుమార్తె అనురాధ జెడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. కుమారుడు రవి ఆయనకు రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న రవికి అవకాశం రావడం లేదు. ఓవైపు తండ్రి డిప్యూటీ సీఎంగా ఉండటం, మరోవైపు సోదరి అనురాధ జెడ్పీటీసీగా ఉండటంతో ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మందికి పదవులు ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ముత్యాల నాయుడు కుమారుడు రవి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని ఆయన ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే మాడుగులలో తన తండ్రి మీద కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది.

కాగా బూడి ముత్యాల నాయుడు 2019లో గెలిచాక ప్రభుత్వ విప్‌ గా పదవి దక్కించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ కన్వీనర్‌ గా, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ముత్యాల నాయుడు బాధ్యతలు చేపట్టారు. అలాగే తారువా గ్రామ సర్పంచ్‌ గా, ములకలాపల్లి ఎంపీటీసీగా, దేవరపల్లి మండల పరిషత్‌ అధ్యక్షునిగా పదవులు దక్కించుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మాడుగుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఇప్పుడు కుమారుడు రవి రూపంలో బూడి ముత్యాల నాయుడుకు సవాల్‌ ఎదురవుతోందని అంటున్నారు. రవి టీడీపీ తరఫున మాడుగులలో పోటీ చేస్తే ఎన్నికల్లో తండ్రీకొడుకుల సమరం తప్పదు. ఈ నేపథ్యంలో ఇటీవల శృంగవరపుకోటలో చంద్రబాబుతో రవి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.