Begin typing your search above and press return to search.

సారుకు పంచ్ వేసి మరీ వినయం ప్రదర్శించటం ముత్తిరెడ్డికే చెల్లు

By:  Tupaki Desk   |   19 Feb 2021 8:30 AM GMT
సారుకు పంచ్ వేసి మరీ వినయం ప్రదర్శించటం ముత్తిరెడ్డికే చెల్లు
X
గుండెల్లో మంట ఉంటుంది. కానీ.. ఆ మంట తాకులూ చిన్న రవ్వను బయటకు చూపించలేదు. మనసు మండిపోతూ ఉంటుంది. కానీ.. ముఖాన మాత్రం నవ్వు చెరగదు. పదవి రాలేదన్న ఆక్రోశం ఉంటుంది.. పదవి రాకుంటే మాత్రం లొల్లి చేయాలా? అంటూ తెలివిగా మాట్లాడే టాలెంట్ అందరు నేతలకు ఉండదు. అలాంటివి కొందరికి మాత్రమే సొంతం. ఆ కోవలోకే వస్తారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.

పార్టీలో పదవులు రాలేదని చీటికి మాటికి కొట్లాటలు వద్దని చెబుతూనే.. తాను చెప్పాలనుకున్న మాటల్ని ఎంత బాగా చెప్పేశారో. ఎవరెన్ని చెప్పినా ఉద్యమం నాటి నుంచి పార్టీలో కొనసాగి.. ఆశకు.. నిరాశకు మధ్యన ఊగిసలాడటమే కాదు.. ఏళ్లకు ఏళ్లు పార్టీ జెండా మోసిన వారి కంటే కూడా.. విభజన తర్వాత పార్టీ పవర్లోకి వచ్చాక చేరిన వారికి పెద్ద పీట వేయటం నచ్చకున్నా.. ఆ విషయాన్ని పట్టించుకోనట్లుగావ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు.

తమ కంటే ఆలస్యంగా.. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి చేరిన వారంతా పార్టీలో చేరితే వారికి పదవులు వస్తున్నాయని.. అలా అని తాను కొట్లాటకు దిగలేదన్న ఆయన.. అదే తన విజయ రహస్యంగా చెప్పుకురావటం గమనార్హం. వర్థన్నపేట.. పాలకుర్తి.. ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా.. కేసీఆర్ ను నమ్ముకోవటంతో జనగామ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు.

పార్టీలోపదవులు రాలేదని.. చీటికిమాటికి కొట్లాటలు వద్దని.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతూ.. అందుకు ఎవరినో ఎందుకు.. తననే ఉదాహరణగా చూపించిన వైనం ఆసక్తికరంగా మారింది. ముత్తిరెడ్డి తాజా మాటలు విన్నంతనే.. పెద్దసారుకు పంచ్ వేసినట్లుగా అనిపించినా.. చివర్లో మాత్రం అమితమైన వినయాన్ని ప్రదర్శించిన తెలివి చూస్తే.. ఆయన్ను అభినందించాల్సిందే.