ముక్కు పుడకతో ముగ్గులోకి.. ఓటర్లకు పంచేందుకు యత్నం.. పట్టుకున్న పోలీసులు!

Sat Mar 06 2021 14:00:01 GMT+0530 (IST)

municipal elections In Andhra Pradesh

అభివృద్ది పనులు చేస్తామని చెప్పి జనాన్ని ఓట్లు అడిగే రోజులు ఏనాడో పోయాయి. తాయిలాలతో తమవారిని చేసుకోవడమే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఇందుకోసం అభ్యర్థులు తమకున్న అవకాశాలన్నీ వాడేస్తారు. కాళ్లు పట్టుకోవడం నుంచి మొదలు పెడితే.. డబ్బు చీరలు వగైరా అన్నీ పంచేస్తారు.తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ సమరానికి తెరలేచిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. దాదాపు 85శాతానికి పైగా పంచాయతీలను వైసీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. దీంతో.. మునిసిపల్ పోరు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.

ఈ ఎన్నికల్లోనైనా సత్తాచాటి పరువు దక్కించుకోవాలని  విపక్షాలు ప్రయత్నిస్తుండగా.. గెలుపు ఒరవడి కొనసాగించాలని అధికార పక్షం ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓ అభ్యర్థి డబ్బు రొటీన్ అవుతుందని భావించారేమో.. బంగారంతో ఓట్లను కొల్లగొట్టడానికి డిసైడ్ అయ్యారు. ముక్కు పుడకలు ఆశచూపి ఓటింగ్ ముగ్గులోకి దింపాలని ప్లాన్ వేశారు. కానీ.. ఆ ప్లాన్ లీక్ కావడంతో పోలీసులకు బుక్కైపోయారు.

ఇదంతా కడప శివారులోని ఇర్కాన్ సర్కిల్ వద్ద బయటపడింది. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 987 బంగారు ముక్కు పుడకలు పట్టుబడ్డాయని సమాచారం. నగరంలోని 37వ డివిజన్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి తనయుడు ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు.