Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే వేధిస్తున్నాడని బోరుమన్న లేడి మున్సిపల్ చైర్మన్.. పదవికి రాజీనామా

By:  Tupaki Desk   |   25 Jan 2023 11:31 PM GMT
ఎమ్మెల్యే వేధిస్తున్నాడని బోరుమన్న లేడి మున్సిపల్ చైర్మన్.. పదవికి రాజీనామా
X
బీఆర్ఎస్ లో మళ్లీ ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. అసంతృప్తి భగ్గుమంటోంది. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాజాగా జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రావణి భోరుమన్నారు. తన ఆవేదన అంతా బయటపెట్టి కంటతడిపెట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.

దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్షగట్టారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకూం జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి నరకప్రాయంగా ఉంది. నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యా.. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానించారని.. మీకు పిల్లలు ఉన్నారు..

ఒక్క పనికూడా నా చేతులతో ప్రారంభించకుండా చేశారని.. జిల్లా కలెక్టర్ ను కలవొద్దని ఆదేశించారని.. అనుకూలంగా ఉన్న కొద్దిమంది కౌన్సిలర్లను కూడా ఇబ్బంది పెట్టారని.. అందరిముందూ అవమానించేవారని శ్రావణి వాపోయారు. బీసీ మహిళననే కక్షగట్టారని.. సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికి రారా? పేరుకే మున్సిపల్ చైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే అని మండిపడ్డారు.

నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని.. ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలి.. కవితను కూడా కలవకూడదు.. కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని హుకూం జారీ చేశారని శ్రావణి వాపోయారు. కవిత ఇంటికి వస్తే కూడా వేధింపులు ఆపలేదన్నారు.

ఎమ్మెల్యేతో మా ప్రాణాలకు ముప్పు ఉందని.. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమన్నారు. రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకుంటున్నట్టు శ్రావణి మీడియా ముందర భోరుమన్నారు. బీఆర్ఎస్ లోని అంతర్గత వ్యవహారాలు బయటపడడంతో అసంతృప్తి జ్వాల ఎగిసిపడుతోంది. ఒక్కరొక్కరుగా బయటకు వస్తుండడంతో ఎన్నికల నాటికి ఇది మరింతగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.