Begin typing your search above and press return to search.

మీ నోటి నుంచి 'మంచి ఫిగర్' అన్న మాట వస్తుందా? జర జాగ్రత్త

By:  Tupaki Desk   |   5 Jun 2023 9:52 AM GMT
మీ నోటి నుంచి మంచి ఫిగర్ అన్న మాట వస్తుందా? జర జాగ్రత్త
X
ఇవాల్టి రోజున మంచి ఫిగర్ అన్న మాట తరచూ వస్తూ ఉంటుంది. ఆ మాటకు వస్తే.. రియాల్టీ షోలలో ఆ మాటను తరచూ వాడుతుంటారు. అయితే.. ఇలాంటి మాట.. ఎవరైనా అమ్మాయి విషయంలో అంటే అశ్లీల వ్యాఖ్య చేసినట్లే. అంతేనా.. లైంగికవేధింపు కింద కేసు నమోదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని తాజాగా ముంబయిలోని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.

మంచి ఫిగర్ అన్న మాట మహిళ గౌరవాన్ని భంగం వాటిల్లేలా చేసినట్లే అన్న మాటను స్పష్టం చేసింది. అలాంటి మాట అనే వారు బెయిల్ తీసుకోవటానికి సైతం అర్హత ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ముంబయి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ని చేసే మహిళ పట్ల ఆ కంపెనీకి చెందిన అసిస్టెంట్ మేనేజర్.. సేల్స్ మేనేజర్ మంచి ఫిగర్ అన్న కామెంట్లు చేసిన వైనంపై సదరు మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో.. సదరు ఉద్యోగులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా బెయిల్ పిటిషన్ కు న్యాయమూర్తి నో చెప్పటం గమనార్హం. ఈ కేసులో పలు కోణాలు ఉన్నాయని.. బెయిల్ పిటిషన్ కు దాఖలు చేసుకున్న వారిని కస్టడీలోనే విచారించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలా కాకుంటే దర్యాప్తు అధికారికి ఉండే విచారించే హక్కును లాగేసుకున్నట్లు అవుతుందని.. చివరకు అది ప్రాసిక్యూషన్ మీద ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. పని స్థలంలో తోటి ఉద్యోగిని వేధించే విషయం తీవ్రమైనదని కోర్టు పేర్కొంది. తోటి ఉద్యోగుల్ని కానీ.. మహిళల్ని కాని మంచి ఫిగర్ అంటూ కామెంట్లు చేయటం నేరమే అవుతుందన్న విషయాన్ని గుర్తించాలి. లేదంటే.. చిక్కుల్లో పడటం ఖాయం.