Begin typing your search above and press return to search.

ఐపీఎల్‌ ఫైనల్‌ కు ముందు చెన్నైకు బిగ్‌ షాక్‌!

By:  Tupaki Desk   |   24 May 2023 3:07 PM GMT
ఐపీఎల్‌ ఫైనల్‌ కు ముందు చెన్నైకు బిగ్‌ షాక్‌!
X
ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే అందరూ చెప్పే మాట.. చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఇప్పటివరకు మొత్తం పదిసార్లు ఈ జట్టు ఐపీఎల్‌ ఫైనల్‌ కు దూసుకెళ్లింది. నాలుగుసార్లు కప్‌ ను గెలుచుకుంది. మరో ఐదుసార్లు రన్నరప్‌ గా నిలిచింది. పదోసారి మరోసారి టైటిల్‌ వేటలో నిలిచింది.

కాగా చెన్నై – గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన తొలి క్వాలిఫైయిర్‌ మ్యాచ్‌ కు విశేష ఆదరణ దక్కింది, చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌ ను వేలాది మంది అభిమానుల ప్రోత్సాహాల మధ్య చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌– గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ పలు రికార్డులకు వేదికైంది. ఈ మ్యాచ్‌ ను జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారంగా చేయగా రికార్డులు బ్రేక్‌ చేసింది. ఏకంగా 2.5 కోట్ల మంది అభిమానులు ఈ మ్యాచ్‌ ను వీక్షించారు. ఇప్పటిదాకా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడిన మ్యాచులన్నింటికి ఇలాంటి ఆదరణే జియో సినిమాలో దక్కుతోంది. ఇప్పుడు ఆ రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది.. తాజాగా సీఎస్కే–జీటీ మ్యాచ్‌.

ఈ మ్యాచ్‌ చివరి ఓవర్లను అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించారు. దీంతో వ్యూవర్‌ షిప్‌ 2.5 కోట్ల మార్క్‌ను తాకింది. ఏప్రిల్‌ 17న చెన్నై – ఆర్బీబీ మ్యాచ్‌కు సైతం 2.4 కోట్ల వ్యూవర్‌ షిప్‌ వచ్చింది. ఈ మేరకు జియో సినిమా ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

కీలకమైన ప్లేఆఫ్స్‌ మ్యాచులకు సంబంధించి ఆరంభంలోనే రికార్డును బ్రేక్‌ చేశామని జియో సినిమా ట్విట్టర్‌ లో తెలిపింది. గుజరాత్‌ – చెన్నై మ్యాచ్‌ను అభిమానులు విశేషంగా ఆదరించారని ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ ఐపీఎల్‌ లో అన్ని మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం జియో సినిమా ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లు కలిపి దాదాపు 1300 కోట్ల వీడియో వ్యూస్‌ను దాటేసింది.

కాగా ఫైనల్‌ కు ముందు చెన్నైకు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ఒక మ్యాచ్‌ నిషేదం పడే ఛాన్స్‌ ఉన్నట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

గుజరాత్‌ టైటాన్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో అంపైర్‌ తో ధోని వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఎంపైర్‌ తో ధోని వాగ్వాదానికి దిగడంతో 4 నిమిషాల విలువైన సమయం వృథా అయ్యింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్‌ రిఫరీ.. ధోనిపై జరిమానా లేదా ఒక మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశం ఉంది అని ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ తెలిపింది. ఇదే జరిగితే ఫైనల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం ధోని కోల్పోయినట్టే.

కాగా ధోని ఎంపైర్‌ తో వాగ్వివాదానికి ఎందుకు దిగాడంటే.. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ లో 16 ఓవర్‌ వేసేందుకు చెన్నై బౌలర్‌ మతీషా పతిరాణా వచ్చాడు. అయితే పతిరాణా బౌలింగ్‌ చేయడానికి ఫీల్డ్‌ అంపైర్‌లు క్రిస్‌ గఫానీ, అనిల్‌ చౌదరి ఒప్పుకోలేదు. ఓవర్‌ వేసేముందు పతిరాణా దాదాపు 9 నిమిషాలు మైదానంలో లేడు. నేరుగా డగౌట్‌ నుంచి బౌలింగ్‌ చేయడానికి సిద్దపడిన అతడిని అంపైర్లు అడ్డుకున్నారు. రూల్స్‌ ప్రకారం మైదానంలో లేకుండా అలా నేరుగా వచ్చి బౌలింగ్‌ చేయకూడదు. బౌలింగ్‌ చేయాలంటే బౌలింగ్‌ కు ముందు కనీసం 9 నిమిషాలపాటు మైదానంలో ఉండి తీరాలి.

ఈ క్రమంలో ధోని అంపైర్ల వద్దకు వచ్చి వారితో వాదనకు దిగాడు. ఆఖరికి ధోని అంపైర్లను ఒప్పించడంతో పతిరణా ఆ ఓవర్‌ వేశాడు. ఈ క్రమంలో ధోని అంపైర్లతో వాదనకు దిగినప్పుడు 4 నిమిషాల సమయం వృథా అయ్యింది. ఈ నేపథ్యంలోనే అతడిపై ఒక మ్యాచ్‌ వేటు వేసే అవకాశం ఉందని సమాచారం.