Begin typing your search above and press return to search.

కేసీఆర్ త‌గ్గితే ఇలా ఉంటుంది..!

By:  Tupaki Desk   |   6 Nov 2017 4:29 PM GMT
కేసీఆర్ త‌గ్గితే ఇలా ఉంటుంది..!
X
ఎక్క‌డ ఎక్కాలో కాదు.. ఎక్క‌డా త‌గ్గాలన్న విష‌యంలోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారు. త‌గ్గాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ఈగోలు ప్ర‌ద‌ర్శించ‌కుండా త‌గ్గ‌టమే కాదు.. డ్యామేజ్ కంట్రోల్‌ ను నూటికి నూరు శాతం ప్ర‌ద‌ర్శించారు. ఇలాంటి వేళ‌లో ఆయ‌న త‌న అధికారాన్ని అస్స‌లు ప్ర‌ద‌ర్శించారు. సుదీర్ఘ ఉద్య‌మ బ్యాక్ గ్రౌండ్ ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణంగా చెప్పాలి.

ప‌వ‌ర్ ఉంద‌న్న ఉద్దేశంలో కొన్ని సంద‌ర్భాల్లో ఈగోను ప్ర‌ద‌ర్శిస్తే.. అధికార‌ప‌క్షంలో ఉన్న త‌మ‌కు ఎంత‌టి ఇబ్బంద‌న్న విష‌యం కేసీఆర్‌ కు బాగా తెలుసు. అందుకే.. భావోద్వేగ ఘ‌ట‌న ఏదైనా చోటు చేసుకున్న‌ప్పుడు వెంట‌నే త‌గ్గిపోతారు. అంద‌రిని క‌లుపుకెళ్లేలా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు..ఎవ‌రు స‌ల‌హా ఇచ్చినా స్వీక‌రించ‌టానికి తాను సిద్ధ‌మ‌న్న మాట‌ను చెప్పేస్తారు.

ఇలాంటి వేళ‌లో మొండిత‌నాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసే కేసీఆర్ తీరు ఈరోజు మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ కోసం ఎమ్మార్పీఎస్ ఎంతోకాలంగా పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో ఈ ఇష్యూపై హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ ఎదుట క‌లెక్ట‌రేట్ ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న తోపులాట‌లో ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త భార‌తి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించేస‌రికి ఆమె ప్రాణాలు పోయిన‌ట్లుగా వైద్యులు వెల్ల‌డించారు.

ఈ వ్య‌వ‌హారం తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీనిపై ప‌లు పార్టీలు ప‌లు విధాలుగా డిమాండ్ల చేస్తున్న వేళ‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్పందించారు. భార‌తి మ‌ర‌ణంపై ప్ర‌క‌ట‌న చేశారు. ఆమె కుటుంబానికి రూ.25ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. ఆమె కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం ఇస్తామ‌ని.. ఉద్యోగం చేసే వ‌య‌సున్న పిల్ల‌లు లేని ప‌క్షంలో వారికి ఉచిత విద్యను అందిస్తామ‌న్నారు.

భార‌తి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప‌లు పార్టీలు చేసిన డిమాండ్ల‌కు ఎలాంటి భేష‌జాలకు పోకుండా అన్నింటికి సీఎం సానుకూలంగా స్పందించ‌టం గ‌మ‌నార్హం. భార‌తి మృతికి కార‌ణ‌మైన ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం మీద కూడా కేసీఆర్ త‌న వాద‌న‌ను వినిపించారు. నిజానికి అనుకోనిది జ‌రిగిన‌ప్పుడు ఆగ‌మాగ‌మైపోయి.. రియాక్ట్ కావ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని పాల‌కుల‌కు భిన్నంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారు.

అంతేనా.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌న‌కు తాము ముందు నుంచి అనుకూలంగానే ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై ప్ర‌ధాని మోడీతో మాట్లాడాన‌ని.. మ‌ళ్లీ ఈ స‌మ‌స్య‌ను ప్ర‌ధానికి వివ‌రించేందుకు అన్ని పార్టీల స‌భాప‌క్ష నేత‌ల సంత‌కాల్ని సేక‌రించి రెండు మూడు రోజుల్లో ప్ర‌ధాని అపాయింట్ మెంట్ కోర‌నున్న‌ట్లు స‌భ‌కు చెప్ప‌టం ద్వారా ఇష్యూను అసెంబ్లీలోనే స‌మ‌సిపోయేలా చేశారు. అంతేకాదు.. భార‌తి మృతి నేప‌థ్యంలో ఎమ్మార్పీఎస్ ఆందోళ‌న‌లు పెద్ద ఎత్తున చేప‌ట్ట‌కుండా ముందుజాగ్ర‌త్త‌గా.. ఆందోళ‌న‌ల్ని విర‌మించాల‌ని కోరారు. భార‌తి మృతి నేప‌థ్యంలో స‌భ‌ను నిర్వ‌హించ‌టం స‌బ‌బు కాద‌ని విపక్ష నేత‌లు వ్యాఖ్యానించ‌టంతో.. వారి అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న స‌భాప‌తి మ‌ధుసూద‌నాచారి స‌భ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. ఇందులోనూ కేసీఆర్ సానుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాలి.

ఇక.. ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త భార‌తి మృతి చెందటానికి అస‌లేం జ‌రిగింద‌న్న వీడియో ఫుటేజ్ ను తాను చూసిన‌ట్లుగా చెప్పిన కేసీఆర్‌.. ఆమె ప‌డిపోయిన వెంట‌నే.. పోలీసులే ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్లారంటూ స‌భ‌లో ప్ర‌క‌టించ‌టం కాకుండా.. ఆమెను కాపాడేందుకు ప్ర‌భుత్వం ఎలా వ్య‌వ‌హ‌రించింద‌న్న విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్పార‌నాలి. ఒక ఆందోళ‌న పెర‌గ‌కుండా చూసుకోకుండా.. ఇష్యూను వెనువెంట‌నే క్లోజ్ అయ్యేలా చేయ‌టంలో కేసీఆర్ చొర‌వ‌ను మిగిలిన అధినేత‌లు ఫాలో కావాల్సిన అవ‌స‌రం ఉంది. ఆందోళ‌న‌ల్ని అన‌వ‌స‌రంగా నెత్తిన వేసుకోకుండా ఉండ‌టంలో కేసీఆర్ శైలే వేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.