Begin typing your search above and press return to search.

సుజనా వెంట అంతా టీడీపీ నేతలే!

By:  Tupaki Desk   |   27 Aug 2019 6:03 AM GMT
సుజనా వెంట అంతా టీడీపీ నేతలే!
X
ఆయన మెడలో కండువా అయితే మారింది కానీ.. ఆయన తీరులో మార్పు లేదు. అసలు తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరడం వెనుకే సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడి ఆదేశాలు ఉన్నాయనే ప్రచారం మొదటి నుంచి ఉంది. తన అవసరం నిమిత్తం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి చంద్రబాబు నాయుడు కొంతమందిని పంపించారనే విశ్లేషణలు ఉండనే ఉన్నాయి. వారు అక్కడకు చేరి కూడా చంద్రబాబు నాయుడుకు వంత పాడుతూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేయడానికి వారు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారనే అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి.

అలా పార్టీ మారినా సుజనా చౌదరికి తెలుగుదేశం పార్టీ మూలాలు అయితే ఎక్కడికీ పోయేలా లేవు. తాజాగా ఆయన రాజధాని విషయంలో స్పందిస్తున్న తీరు కూడా తెలుగుదేశం పార్టీకి అనుగుణంగానే ఉంది. రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలు మార్పు విషయంలో వ్యతిరేక వాణి వినిపిస్తూ ఉన్నారు. రాజధాని మార్పుకు తెలుగుదేశం పార్టీనే పెద్ద వ్యతిరేకిగా ఉంది.

ఇక భారతీయ జనతా పార్టీ తరఫును కూడా టీడీపీ వాణి వినిపించడానికి సుజనా చౌదరి కసరత్తు చేస్తూ ఉన్నారు. అందుకే ఉన్నట్టుండి రాజధాని ప్రాంతంలో పర్యటన అంటూ ఆయన హడావుడి చేస్తూ ఉన్నారు. అయితే ఆ హడావుడిలో అంతా తెలుగుదేశం పార్టీ వాళ్లే కనిపిస్తూ ఉండటం గమనార్హం.

సుజనా చౌదరి అమరావతి పచార్లలో తెలుగుదేశం పార్టీ వాళ్లే యాక్టివ్ గా కనిపించారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కండువాలను కాసేపు పక్కన పెట్టి భారతీయ జనతాపార్టీ కండువాలు వేసుకుని వారంతా సుజనా చౌదరి వెంట తిరిగినట్టుగా తెలుస్తోంది. సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీలోకి చేరినా చంద్రబాబు నాయుడు ఆయనకు సపోర్ట్ గా ఆయన చంద్రబాబుకు సపోర్టుగా ఉంటారనే అభిప్రాయాల నేపథ్యంలో.. తెలుగుదేశం కార్యకర్తలే సుజనా చౌదరి వెంట నడిచినట్టుగా తెలుస్తోంది.

ఎలాగూ జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే తెలుగుదేశం అజెండా, ఆ అజెండానే సుజనా ఫాలో అవుతూ ఉన్నారు. ఈ మేరకు ఉమ్మడిగా గేమ్ ను అమలు చేస్తున్నట్టుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.