Begin typing your search above and press return to search.

ఇది వైసీపీకి మైనస్సే: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   18 Feb 2023 4:05 PM GMT
ఇది వైసీపీకి మైనస్సే: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు!
X
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్‌ అవుతుందని అభిప్రాయపడ్డారు. తాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వరకు పాదయాత్రలు చూశానని తెలిపారు.

ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితిని తానెప్పుడూ చూడలేదని ఉండవల్లి తప్పుబట్టారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని.. హత్యలు ఉండవన్నారు.

నాడు కాంగ్రెస్‌ జగన్‌ను జైలుకు పంపడం వల్లే ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇలా అధికారంలో ఉన్న పార్టీలే సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబును అనపర్తిలో పోలీసులు అడ్డుకున్న వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందేనని ఉండవల్లి పరోక్షంగా చెప్పినట్టయింది.

కాగా సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 22న ఏపీ విభజన కేసుపై వాయిదా ఉందని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గుర్తు చేశారు. ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ వేయాలని కోరారు. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని అన్నారు. తన వాదన సరైందని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే విభజన హక్కులు సాధిస్తామని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 18 రాష్ట్ర విభజన జరిగిన దుర్దినమని తెలిపారు. కానీ, నేటికి రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందలేదన్నారు. తప్పు జరిగిన విషయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒప్పుకోకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించలేదన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా ఇప్పటికీ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా 2004, 2009 ఎన్నికల్లో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎంపీగా ఘన విజయం సాధించారు. గత రెండు ఎన్నికలు 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం వివిధ రాజకీయ అంశాలపై వివిధ యూట్యూబ్‌ చానళ్లకు, మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.