Begin typing your search above and press return to search.

పోలీసులు నన్ను కొట్టారు: జడ్జీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు

By:  Tupaki Desk   |   15 May 2021 2:30 PM GMT
పోలీసులు నన్ను కొట్టారు: జడ్జీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు
X
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలపై నిన్న ఏపీ సీఐడీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు హైకోర్టులో ఎంపీ రఘురామ బెయిల్ పిటీషన్ పై విచారణ జరగ్గా జిల్లా కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు సూచించింది. పోలీసులు సీఐడీ కోర్టులో రఘురామను హాజరు పరుచాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును జడ్జీకి అందించారు. దీనిపై వాదనలు కొనసాగాయి. రఘురామపై సీఐడీ పెట్టిన కేసులు.. సెక్షన్లు చెల్లవని ఎంపీ తరుఫున లాయర్లు వాదించారు. బెయిల్ పిటీషన్ తోపాటు అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటీషన్ దాఖలు చేశారు.

ఇక తనను పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారని.. నిన్న రాత్రి వేధింపులకు గురిచేశారంటూ రఘురామకృష్ణంరాజు జడ్జీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి అందజేసినట్టు సమాచారం. ఆయన కాలికి గాయాలు కావడంపై హైకోర్టులోనూ పిటీషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.

ఎంపీ రఘురామ కాళ్లకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించాలని కోర్టు సూచించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు ఎంపీ రఘురామ నిరాకరించడంతో రఘురామకు రమేశ్ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని జడ్జీ ఆదేశించారు. ఇక రఘురామను పోలీసులు కొట్టిన ఘటనను తాము లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని.. ఈ వ్యవహారంలో సీబీఐ లేదా ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని ఎంపీ తరుఫున లాయర్లు జడ్జీని కోరారు.

ఎంపీ కాలి గాయాలు చూసి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించినట్టు సమాచారం. ఎంపీ రఘురామను వెంటనే వెంటనే మెడికల్ బోర్డుతో పరీక్ష చేయించాలని కోర్టు ఆదేశించింది. సెషన్స్ కోర్టు రికార్డు స్టేట్ మెంట్ ను వెంటనే హైకోర్టు ముందు ఉంచాలని సూచించింది.

ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసులను విచారించేందుకు హైకోర్టులో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ లలిత ఆధ్వర్యంలోని బెంచ్ లో విచారణ జరుగుతోంది.