Begin typing your search above and press return to search.

సారుకు బర్త్ డే విషెస్ చెప్పి.. అలా ఫైర్ అవుతారేం అర్వింద్

By:  Tupaki Desk   |   18 Feb 2021 7:30 AM GMT
సారుకు బర్త్ డే విషెస్ చెప్పి.. అలా ఫైర్ అవుతారేం అర్వింద్
X
పండుగ పూట కూడా పాత మొగుడే అన్న ముతక సామెత గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్. కత్తి మొనతో గుచ్చినట్లుగా ఉండే మాటలతో.. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఎంతలా విరుచుకుపడుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. సీఎం కేసీఆర్ అన్నా.. ఆయన ఫ్యామిలీ అన్నా చాలు.. అర్వింద్ నిద్రలో కూడా తిట్టిపోసేస్తారన్న రీతిలో ఫైర్ అవుతుంటారు. మిగిలిన రోజులు ఎలా ఉన్నా.. పుట్టినరోజున కూడా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తకరంగా మారాయి.

పుట్టినరోజును పురస్కరించుకొని సీఎంసాబ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు అర్వింద్. అక్కడితో ఆ పని అయిపోయిన వెంటనే.. తనకు అలవాటైన రీతిలో కేసీఆర్ పై తిట్లదండకాన్ని షురూ చేవారు. ఎమ్మెల్యేలు చనిపోతే తప్పించి సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వస్తారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫండ్ ఇవ్వకపోవటంతో ఎమ్మెల్యేలు దళితుల భూముల మీద పడ్డారన్నారు.

తన నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం మెగ్యనయక్ తండాలో మరణించిన జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అర్వింద్.. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఫాంహౌజ్ కు వెళ్లిపోతారని.. ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆయన బయటకు వస్తారన్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవటానికే మిషన్ భగీరథ.. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారన్నారు. పుట్టినరోజు నాడు కూడా సీఎం కేసీఆర్ ను విడిచిపెట్టకుండా ఫైర్ అయిన ఎంపీ అర్వింద్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.