Begin typing your search above and press return to search.

'ది టెర్మినల్' మూవీ సీన్ సియోల్ ఎయిర్ పోర్టులో రిపీట్

By:  Tupaki Desk   |   30 Jan 2023 11:01 AM GMT
ది టెర్మినల్ మూవీ సీన్ సియోల్ ఎయిర్ పోర్టులో రిపీట్
X
కరోనా వేళ.. లాక్ డౌన్ విధించటంతో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటివేళలో.. అప్పుడప్పుడు ఆదరణ పొందుతున్న ఓటీటీల్లో సినిమాల్ని చూసే ధోరణి విపరీతంగా పెరిగింది. తొలుత తమ ప్రాంతీయ భాషల్లోని సినిమాల్ని చూసినోళ్లు.. సరికొత్త సినిమాల్ని చూసేందుకు ప్రయత్నించటం.. ఇందులో భాగంగా వివిధ భాషల్లోని చిత్రాల్ని చూసి.. భలే ఉందంటూ పలువురికి షేర్ చేయటంతో కొన్ని సినిమాలు చాలా పాపులర్ అయ్యాయి. అలాంటి సినిమాల్లో ఒకటి హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్ బర్గ్ నిర్మించిన ది టెర్మినల్ మూవీ.

తాజాగా ఈ సినిమా మాదిరే ఐదుగురు రష్యాకు చెందిన యువకులు సియోల్ ఎయిర్ పోర్టులో ఉండిపోవటం.. అది కూడా గడిచిన ఐదు నెలలుగా ఉన్న విషయం బయటకు వచ్చింది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగటం.. దేశంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడేందుకు పలువురు రష్యన్ యువకులు దేశాన్ని విడిచి వెళ్లిపోవటం తెలిసిందే. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యన్ సైనికులు పెద్ద ఎత్తున చనిపోతున్న వేళ.. వారికి బదులుగా రష్యన్ యువకులు సైన్యంలో చేరాలన్న నిర్బంధాన్ని అక్కడ అమలు చేయటం తెలిసిందే. దీంతో.. సైన్యంలో చేరేందుకు ఆసక్తి లేని వారు వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు.

అలా ఐదుగురు యువకులు దక్షిణ కొరియా రాజధాని సియోల్ కు వెళ్లారు. అయితే.. ది టెర్మినల్ సినిమాలో హీరోకు పారిస్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి అధికారులు ఒప్పుకోరో.. ఐదుగురు రష్యన్ యువకులకు అలాంటి పరిస్థితే నెలకొంది. ది టెర్మినల్ మూవీ విషయానికి వస్తే.. ఒక వ్యక్తి తన దేశం నుంచి పారిస్ కు వస్తాడు. సరిగ్గా.. ఇమ్మిగ్రేషన్ పూర్తి అయ్యే వేళలో.. సదరు వ్యక్తికి చెందిన దేశంలో అత్యయిక పరిస్థితి నెలకొనటం.. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే వారిని దేశంలోకి అనుమతించొద్దని పేర్కొంటూ ఆదేశాలు రావటం జరిగిపోతాయి.

దీంతో.. అతన్ని పారిస్ లోకి అనుమతించలేమని ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేస్తారు. దీంతో.. ఎయిర్ పోర్టులోనే ఉండిపోతాడు. సినిమాలో మాత్రం.. హీరోను ఎయిర్ పోర్టు నుంచి ఏదోలా బయటకు పంపి.. ఆ వెంటనే అక్రమంగా పారిస్ లోకి అడుగుపెట్టాడన్న ఆరోపణతో అరెస్టు చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ.. అలా జరగదు. ఆసక్తికరంగా సాగే ఈ మూవీని ఇక్కడితో వదిలేసి.. రష్యాకు చెందిన ఆ ఐదుగురు యువకుల విషయానికి వస్తే.. వారిని సియోల్ లో అడుగు పెట్టేందుకు అధికారులు ససేమిరా అనటం.. మరోవైపు రష్యాకు తిరిగి వెళ్లేందుకు ఆ ఐదుగురు యువకులు ఆసక్తిని చూపించకపోవటంతో వారు.. సియోల్ ఎయిర్ పోర్టులో ఉండిపోయారు.

సైన్యంలోకి కచ్ఛితంగా చేరాలన్న కారణాన్ని చూపిస్తూ వేరే దేశానికి శరణార్ధిగా రావటం సరైనది కాదని దక్షిణ కొరియా న్యాయశాఖ వీరిని సియోల్ లోకి అడుగుపెట్టేందుకు నో చెప్పేసింది. దీంతో.. గడిచిన ఐదు నెలలుగా వీరికి ఒక పూట భోజనాన్ని ఎయిర్ పోర్టు అధికారులు అందిస్తున్నారు. మిగిలిన రెండుపూట్ల భోజనాన్ని ప్రయాణికులు అందించే బ్రెడ్.. డ్రింక్స్ తీసుకొని ఎయిర్ పోర్టులో ఉంటున్నారు. కొన్ని కండీషన్లు పెట్టి.. వాటికి అంగీకారం తెలిపిన నేపథ్యంలో సియోల్ ఎయిర్ పోర్టులో వారిని ఉండేందుకు అనుమతి ఇచ్చారు.

అత్యవసర మసయంలో వారికి అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇలా ఐదు నెలలుగా సాగుతున్న వారి టెర్మినల్ జీవితం మరెంత కాలం సాగుతుందన్నది అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ఇంకా..కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో వీరెంత కాలం ఇలానే ఉండిపోవాలన్నది ప్రశ్నగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.