Begin typing your search above and press return to search.

వారిపై సినీ నటి కుష్భూ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   4 Feb 2023 4:54 PM GMT
వారిపై సినీ నటి కుష్భూ సంచలన వ్యాఖ్యలు!
X
బీజేపీ నాయకురాలు, సినీ నటి కుష్భూ సుందర్‌ కాంగ్రెస్, ద్రవిడ పార్టీలపై మండిపడ్డారు. తాను ముస్లిం అమ్మాయినని.. అయితే హిందువుగా మారానంటూ తన మతాన్ని, పెళ్లిపైన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కుష్భూ ట్వీట్‌ చేశారు.

''నేను హిందువుని పెళ్లి చేసుకున్నప్పుడు నేను ముస్లిం నుండి హిందువుగా మారానని కాంగ్రెస్, ద్రవిడ పార్టీలకు చెందిన కొందరు విమర్శిస్తున్నారు. నేను వారిని చూసి జాలిపడుతున్నారు. ప్రత్యేక వివాహ చట్టం గురించి వారెప్పుడు విని ఉండరు. మీ నాలెడ్జ్‌ ని బ్రష్‌ చేయండి. ఇది మీరు సిగ్గుపడకుండా కాపాడుతుంది'' అంటూ తన ట్వీటులో మండిపడ్డారు. అంతేకాకుండా ఆ ట్వీటుతో పాటు కుష్బూసుందర్‌ .. నఖత్‌ ఖాన్‌ అంటూ పేర్కొనడం విశేషం.

కాగా నెటిజన్లు తలో రీతిలో ఆమె ట్వీటుకు రిప్లై ఇస్తున్నారు. ''ప్రత్యేక వివాహ చట్టం 1954లో వచ్చిందని.. కాబట్టి మీరు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరియు నెహ్రూకి కృతజ్ఞతలు చెప్పాలి'' అని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

మరొక నెటిజన్‌ ఇలా ట్వీట్‌ చేశాడు.. ''హ హ, పాపం, మీరు ద్రావిడ దేశంలో ఉన్నందున, మతం, కులాలతో సంబంధం లేకుండా మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు వివాహం చేసుకోగలిగారు. మీరు మీ ప్రస్తుత పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉంటే.. వారు మిమ్మల్ని 'లవ్‌ జిహాదీ' అని లేబుల్‌ వేసేవారు'' అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు.

మరొక నెటిజన్‌.. ''మీ చుట్టూ ఈ రకమైన విమర్శకులు ఉన్నప్పుడు, ఇది మీ జనాదరణ ఇప్పటికీ ఉందని నిరూపితమవుతోంది'' అంటూ ట్వీట్‌ చేశాడు.

కాగా ముంబైకి చెందిన ఖుష్బు అసలు పేరు నఖత్‌ ఖాన్‌. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌ ను 2009లో పెళ్లాడారు. కుష్భూకు తమిళులు ఏకంగా గుడే కట్టారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 200 చిత్రాల్లో కుష్భూ నటించారు.

గతంలో డీఎంకే పార్టీలో ఉన్న కుష్భూ ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరారు. బీజేపీ తరపున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సోషల్‌ మీడియాలో వివిధ అంశాలపై నిత్యం చురుకుగా ఉంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.