Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీద ఎంత నమ్మకం.. దళితబంధు అమలు కాకుంటే సూసైడ్ సంచలనం

By:  Tupaki Desk   |   29 Aug 2021 2:30 PM GMT
కేసీఆర్ మీద ఎంత నమ్మకం.. దళితబంధు అమలు కాకుంటే సూసైడ్ సంచలనం
X
విధేయత ప్రదర్శించేందుకు నేతలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అందునా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకోవాలన్న పట్టుదలతో ఉన్న సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ కలల పంట అయిన దళిత బంధు పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేయటం ఖాయమని.. కేసీఆర్ మీద తనకున్న నమ్మకాన్ని చెప్పుకొచ్చారు.

ఆ మాటలకు అంత ఎఫెక్టు ఉండదని అనుకున్నారో ఏమో కానీ.. గులాబీ నేతల నోటి నుంచి సైతం రాని మాటల్ని తాజాగా చెప్పుకొచ్చారు. దళితబంధు పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తారని.. కేసీఆర్ మాటల్లో నిజాయితీ కనిపించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే చేస్తారన్న నమ్మకం తనకుందన్న ఆయన.. ఒకవేళ ఆయన చెప్పినట్లుగా దళితబంధు నూటికి నూరుశాతం అమలు కాకుంటే తాను పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండ మీద సూసైడ్ చేసుకుంటానని అదిరే ప్రకటన చేశారు.

కేసీఆర్ మీద అచంచల నమ్మకాన్ని ప్రదర్శించిన మోత్కుపల్లి.. తాజాగా చెలరేగిపోతూ.. గులాబీ బాస్ పై ఘాటు విమర్శలు చేస్తున్న రేవంత్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని నిలువునా ముంచింది రేవంతేనని చెప్పిన ఆయన.. అతడి కారణంగానే చంద్రబాబు నాశనమయ్యాడన్నారు. రేవంత్ రెడ్డి జీవితం మొత్తం మోసాలు.. బ్లాక్ మొయిలింగేనని చెప్పారు. ఆర్టీఐని వాడుకుంది రేవంతేనని చెప్పిన మోత్కుపల్లి..దళితబంధు పథకాన్ని కాంగ్రెస్.. బీజేపీలు ఎందుకు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు.

దేశంలో మరే ప్రభుత్వం చేయని రీతిలో దళితుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని.. అదో మహోన్నత నిర్ణయంగా పేర్కొన్నారు. అంతేకాదు.. తన గొప్పతనాన్ని కూడా చెప్పుకున్నారు. ఒక పార్టీలో ఉండి.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ తెచ్చిన దళితబంధుకు మద్దతు ఇవ్వటం సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పుకున్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ గురించి మంచిగా మాట్లాడని మోత్కుపల్లి.. ఇప్పుడెందుకు పొగుడుతున్నారని ప్రశ్నిస్తున్నారని.. అయితే.. మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్టు చేస్తానని చెప్పారు మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కేసీఆర్ మీద తనకున్న నమ్మకాన్ని చెప్పిన మోత్కుపల్లి మాటలు గులాబీ బాస్ గుండెల్ని టచ్ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.