Begin typing your search above and press return to search.

హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల కూతురిపై తల్లి కర్కశం

By:  Tupaki Desk   |   10 Jun 2022 2:30 AM GMT
హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల కూతురిపై తల్లి కర్కశం
X
కసాయి తల్లి కర్కశంగా వ్యవహరించింది. తన కడుపున పుట్టిన బిడ్డ కేవలం హోంవర్క్ చేయలేదని దారుణానికి పాల్పడింది. ఐదేళ్ల బాలికను తాడుతో కట్టేసి ఎర్రటి ఎండలో మేడపైన పడేసింది. ఈ అమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన కన్న బిడ్డపైనే కర్కశానికి పాల్పడిన తల్లిపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తల్లి చేసిన ఈ పని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈశాన్య ఢిల్లీలోని ఖజారి ఖాస్ ప్రాంతంలో 5 ఏళ్ల ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ చేయలేదని తల్లి ఆగ్రహించింది. బాలిక కాళ్లు, చేతులూ తాడుతో కట్టేసి ఇంటి డాబాపై ఎర్రటి ఎండలో పడుకోబెట్టింది. ఎండకు శరీరం కాలుతుంటే బాలిక హాహాకారాలు చేసినప్పటికీ తల్లి పట్టించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి పక్కింటి కుర్రాడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదిప్పుడు వైరల్ గా మారింది..

ఈ వీడియోలో మైనర్ బాలిక తాడుతో కట్టివేయబడి ఉంది. ఎండలో కాలుతున్న టెర్రస్ పై బాలిక నొప్పితో మెలికలు తిరుగుతూ అరుస్తున్నట్టు కనిపించింది. నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్న బాలిక వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. కవాల్ నగర్ లో ఈ దారుణం జరిగినట్టు పోలీస్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.ఖజూరి ఖాస్ప్రాంతంలో వారి ఇంటిని పోలీసులు కనిపెట్టారు. జూన్ 2న ఈ ఘటన జరిగిందని.. బాలిక హోంవర్క్ చేయనందుకు తల్లి ఇలా శిక్షించిందని పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈ ఘటనపై జువైనల్ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అమ్మాయి తండ్రి టైలర్ వృతి చేస్తూ జీవిస్తున్నాడు. జూన్ 2న తన సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్లగా అతడి భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. 5 ఏళ్ల అమ్మాయి, వారి 11 ఏళ్ల కుమారుడిని ఇంట్లో హోంవర్క్ చేయాలని తల్లి ఆదేశించింది. కూతురు వినకపోవడంతో తాడుతో కట్టేసి మేడపైన ఎర్రటి ఎండలో వేసింది. అప్పుడే తనకు మా నాన్న నుంచి కాల్ వచ్చిందని.. ఇంటికి వచ్చేసరికి తన తండ్రి బాలికను విడిపించాడని తెలిపారు. తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వెల్లడించాడు. ఈ ఘటనను ఇంటిపక్కనే ఉండే మైనర్ బాలుడు వీడియో రికార్డ్ చేశాడని బాలిక తండ్రి తెలిపారు.

ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంత హోంవర్క్ చేయకుంటే మాత్రం ఇంత దారుణంగా కన్నకూతురికి శిక్ష వేస్తారని ఆ కసాయి తల్లిపై మండిపడుతున్నారు. సొంత బిడ్డపై  ఇంతటి దారుణానికి పాల్పడిన తల్లిని పిశాచి అంటూ తిట్టిపోస్తున్నారు.