Begin typing your search above and press return to search.

ఇవేం ఆత్మహత్యలు కేసీఆర్?

By:  Tupaki Desk   |   17 April 2022 3:48 AM GMT
ఇవేం ఆత్మహత్యలు కేసీఆర్?
X
తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందెప్పుడు చూడని దరిద్రపుగొట్టు రాజకీయం కళ్ల ముందుకు వచ్చింది. చేతిలో ఉన్న అధికారంతో కన్నుమిన్ను కానరాకుండా జరుపుతున్న వేధింపులకు తాళలేక.. కుటుంబాలు బలవ్మరణం చెందే దారుణ పరిస్థితి తెలంగాణలో తరచూ కనిపిస్తోంది. తాజాగా అలాంటి దారుణ ఉదంతమే మరోసారి చోటు చేసుకుంది.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. ఏ దరిద్రాలు కనిపించకూడదో.. అందుకు భిన్నంగా నీచమైన రీతిలో రాజకీయ చేస్తూ.. తమకున్న అధికార మదంతో అమాయకపు ప్రాణాలు పోయేలా చేస్తున్న దారుణాలు తెలంగాణలో అదే పనిగా రిపీట్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ అధికారపార్టీకి చెందిన ఒక నేత కొడుకు చేష్టలకు తాళలేక.. యావత్ కుటుంబం నిప్పు అంటించుకొని ప్రాణాలు తీసుకున్న విషాద ఉదంతాన్ని మర్చిపోక ముందే.. ఆ దారుణం మరోసారి గుర్తు వచ్చే ఘటన రిపీట్ అయ్యింది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక లాడ్జిలో మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగం సంతోష్ (41).. ఆయన తల్లి పద్మ (68) ఆత్మహత్కు పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. తమ చావులకు కారణం ఫలానా అని రాసి మరీ ఈ తల్లీకొడుకులు తనువులు చాలించారు. తమ చావులకుకారణమైన వారిని అందరూ చూస్తుండగా శిక్షించాలంటూ సీఎం కేసీఆర్.. మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులతో పాటు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలను వేడుకోవటం గమనార్హం.

తెలంగాణ అధికార పక్షానికి చెందిన నేతలు ఏడాదిన్నర కాలంగా తనకు నిత్యం నరకం చూపిస్తున్నారని.. వారేం చేసినా.. ఎవరూ పట్టించుకోవటం లేదని తల్లీకొడుకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏమిటన్న విషయాన్ని తెలియజేస్తూ..ఐదు పేజీల సూసైడ్ లెటర్ ను సంతోష్ తన ఇంట్లో ఉంచారు. ఆత్మహత్యకు ముందు.. దాన్ని వాట్సాప్ లో తన మిత్రులకు పంపటంతో పాటు.. ఫేస్ బుక్ వీడియో ద్వారా తెలియజేశారు. తమ ఆత్మహత్యకు కారణమైన ఆధారాలను మాయం చేస్తారనే తాము ఇదంతా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఇంతకీ ఆత్మహత్య ఎందుకు చేసుకున్న విషయాన్ని సంతోష్ వెల్లడిస్తూ.. ‘బాల్య మిత్రుడైన శ్రీనివాస్ తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశా. అతడి వద్ద డబ్బులు లేకపోవటంతో మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్ సాయం చేశారు. వ్యాపారంలో యాభై శాతం వాటా అడిగితే కాదన్నాం.

ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పిల్ల జమిందార్ అని ఏదో పోస్టు పెడితే.. జితేందర్ స్నేహితుల బ్రందం ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి సీఐ నాగార్జున గౌడ్ స్టేషన్ కు పిలిపించారు. నా ఫోన్ తీసుకున్నారు. తర్వాతి రోజున మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశా. నా ఫోన్ లో ఉన్న వ్యక్తిగత డేటాను దొంగలించి.. జితేందర్ గౌడ్ టీంకు ఇచ్చారు. వారు దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మొయిల్ చేయటం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశా. ఏడాదిగా అదే పనిగా ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయనీయలేదు. దీంతో అప్పులపాలయ్యా. తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి మోసం చేశాడు' అని పేర్కొన్నారు.

తన కొడుకుతో మంచిగా ఉంటూనే తమ కుటుంబానికి అన్ని రకాలుగా కష్టాలు పెట్టిన ఆ ఏడుగురిని శిక్షించాలంటూ సంతోష్ తల్లి పద్మ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నారు. తమది మరణ వాంగ్మూలంగా పరిగణలోకి తీసుకొని శిక్షించాలని అభ్యర్థించారు. ఆత్మహత్య చేసుకన్న తల్లీ కొడుకులు కోరుకున్న ఆ ఏడుగురు ఎవరంటే..

- రామాయం పేట పట్టణ పురపాల సంఘం అధ్యక్షుడు పల్లె జితేందర్ గౌడ్
- ఐరేని బాలు
- మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి
- తోట కిరణ్
- కన్నాపురం క్రిష్ణా గౌడ్
- యాదగిరి కుమారుడు సరాబ్ స్వరాజ్
- ప్రస్తుత తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్

రాజకీయ అండ ఉన్న వారు.. రాజకీయాల్లో ఉన్న వారు అధికారం చెలాయించటం మామూలే అయినా.. ఈ స్థాయిలో ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది కాదు. అనూహ్యంగా తెలంగాణలో మాత్రం తరచూ ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోవటాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తన పాలనలో అంతా మంచే జరుగుతుందని చెప్పుకునే ఆయన.. తన పార్టీకి చెందిన నేతల కారణంగా.. వారు పెట్టే ఒత్తిళ్లు.. వేధింపుల్ని భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం రాష్ట్రానికి ఎంతమాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.