Begin typing your search above and press return to search.

దోమ‌లు మ‌నిషిక‌న్నా తెలివైన‌వి బ్రో... ఎంత‌గా అంటే!

By:  Tupaki Desk   |   13 Sep 2022 4:30 PM GMT
దోమ‌లు మ‌నిషిక‌న్నా తెలివైన‌వి బ్రో... ఎంత‌గా అంటే!
X
దోమల సీజన్‌ వచ్చిందంటే నరకమే. చర్మంపై సూదుల్లా గుచ్చి రక్తం పీల్చడమే కాకుండా మనల్ని అనారోగ్యం పాల్జేస్తుంటాయి మశకాలు. వాటి దాడి నుంచి తప్పించుకోవడానికి జనం పడే పాట్లు అన్నీఇన్నీ కావు. కొందరు మాత్రం ఈ కీటకాలకు ఎక్కువ లక్ష్యంగా మారుతుంటారు. ఇది ఎందుకు? మనుషులవైపు దోమలు ఎలా ఆకర్షితమవుతాయి? ఇందుకు దోహదపడే అంశాలేంటన్నదానిపై కీటకాల నిపుణులు ఏమంటున్నారంటే..

పగటివేళ రక్తాన్ని గుర్తించడానికి దోమలు దృష్టి, ధ్వని, వాసన సామర్థ్యాలను ఉపయోగించుకుంటుం టాయి. రాత్రిపూట మాత్రం పూర్తిగా వాసనపైనే ఆధారపడుతుంటాయి. ప్రధానంగా కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఇవి పసిగడుతుంటాయి. మానవులు సహా వెన్నెముక జీవులన్నీ తమ శ్వాస ద్వారా ఈ వాయువును విడుదల చేస్తుంటాయి. దీని ఆధారంగా.. కొద్దిమీటర్ల దూరంలో ఉన్న మనుషులను ఈ కీటకాలు పసిగట్ట గలవు. అయితే వాహనాలు వంటి నిర్జీవ వనరుల నుంచీ కార్బన్‌ డైఆక్సైడ్‌ విడుదలవుతుంటుంది.

ఈ నేపథ్యంలో.. తాను పసిగట్టిన వాయువు ప్రాణుల నుంచి విడుదలైందా అన్నది నిర్ధారించుకోవడానికి అదనపు మార్గాలను దోమలు అనుసరిస్తుంటాయట‌. శ్వాస, కదలికలు వంటి జీవక్రియల ద్వారా ప్రాణుల నుంచి వెలువడే లాక్టిక్‌ ఆమ్లం, అమోనియా, ఫ్యాటీ ఆమ్లాల వాసనను ఇవి పసిగడతాయి. తద్వారా ఆ కార్బన్‌ డైఆక్సైడ్‌.. జీవుల నుంచే వచ్చిందని రూఢి చేసుకుంటాయి.

జీవక్రియ రేటును జన్యుపరమైన అంశాలు నిర్ధారిస్తుంటాయి. శారీరక చర్యల ఫలితంగా కూడా అది పెరు గుతుంటుంది. అందువల్లే.. పరుగులు తీసిన అథ్లెట్లు ఆ తర్వాత కూల్‌డౌన్‌ వ్యాయామాలు చేసేటప్పుడు ఎక్కువగా దోమల కాటుకు గురవుతుంటారు. గర్భిణుల్లో జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. అందువల్ల వారు కూడా ఈ కీటకాలకు లక్ష్యంగా మారుతుంటారు.

రక్తాన్ని గుర్తించడానికి సహజసిద్ధ వాసనలపై కూడా దోమలు ఆధారపడుతుంటాయి. ఉదాహరణకు అనాఫెలస్‌ దోమలు.. మనిషి పాదం నుంచి వెలువడే కొన్ని రకాల వాసనలకు ఆకర్షితమవుతుంటాయి. ఈ రకం కీటకాలు మనుషుల్లో మలేరియా వ్యాప్తి చేస్తుంటాయి. ఇళ్లల్లో రాత్రివేళ రక్తాన్ని పీలుస్తుంటాయి. అవి పాదాలపైనే కుడుతుంటాయి. కార్బన్‌ డైఆక్సైడ్‌ అధికంగా ఉత్పత్తయ్యే తలభాగం జోలికి వెళ్లవు. తద్వారా అవి బాధితుడికి నిద్రాభంగం కాకుండా చూస్తూ తమ పని సాఫీగా కానిచ్చేస్తుంటాయి.

దోమలు పగటి వేళ దృశ్యపరమైన సంకేతాలను ఉపయోగించుకోవడం ద్వారా రక్తపు వనరును గుర్తిస్తాయి. ఈ కీటకాలు సాధారణంగా నేల నుంచి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి. బాధితులను పసిగట్టడానికి ఈ లక్షణం వాటికి బాగా ఉపయోగపడుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.