Begin typing your search above and press return to search.

విడిపోయిన ఆ దేశాలు ఫ్యూచర్లో కలవొచ్చు..మోహన్ భగవత్ నోట ఆసక్తికర వ్యాఖ్య

By:  Tupaki Desk   |   26 Feb 2021 4:13 AM GMT
విడిపోయిన ఆ దేశాలు ఫ్యూచర్లో కలవొచ్చు..మోహన్ భగవత్ నోట ఆసక్తికర వ్యాఖ్య
X
సంఘ్ పరివార్ అగ్రనేత మోహన్ భగవత్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. అఖండ్ భారత్ అంటూ ఆర్ఎస్ఎస్ మౌలిక నినాదాన్ని తాజాగా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ లోఒక పుస్తక ఆవిష్కరణ కోసం హాజరైన ఆయన.. కాలకూట విషాన్ని గరళంలో ఉంచుకొని శివుడు ప్రపంచాలను కాపాడాడని.. అదే రీతిలో ప్రపంచంలో కలిగే అనేక విపత్తులు.. వికృతుల నుంచి ప్రపంచాన్నికాపాడగలిగేది భారతదేశం మాత్రమేనని.. ఆ విషయాన్ని అన్ని దేశాలు గుర్తిస్తున్నాయన్నారు.

ధర్మానికి కేంద్ర బిందువైన భారత్ నుంచి విడిపోయిన దేశాలు ప్రత్యేకంగా ఏర్పడినా.. నేటికి అశాంతి..అలజడితోనే ఉన్నాయన్న విషయాన్ని మోహన్ భగవత్ గుర్తు చేశారు. దేశం నుంచి విడిపోయిన భూభాగాలు భవిష్యత్తులో తిరిగి భారత్ లో కలవచ్చన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇదే కార్యక్రమంలో పుస్తకాన్ని రచించిన మాడగుల నాగఫణిశర్మ కార్యక్రమ విశిష్ఠతను వివరిస్తూ.. ఒకప్పుడు భూమండలమంతా భారత ధర్మమే విస్తరించి ఉండేదన్నారు. అలాంటి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి భుజస్కందాల మీద ఉందన్నారు. విడిపోయిన రాష్ట్రాలే కలిసేందుకు సిద్ధంగా లేని వేళ.. విడిపోయిన దేశాలు కలవటం.. అందునా పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కలుస్తాయన్న మాటలు వాస్తవానికి చాలా దూరమని చెప్పక తప్పదు. సంఘ్ పరివార్ తరచూ కలగనే మాటల్ని ఆ సంస్థ చీఫ్ మరోసారి వ్యాఖ్యానించారని చెప్పక తప్పదు.