Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. మ‌రో కొత్త వివాదం!

By:  Tupaki Desk   |   17 Jun 2023 9:30 AM GMT
ప్ర‌ధాని మోడీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. మ‌రో కొత్త వివాదం!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. మోడీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ భగ్గుమంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ప్ర‌తిష్టాత్మ‌క‌ నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును.. మోడీ ప్రభుత్వం మార్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై మండిపడింది.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అధికారిక నివాసం తీన్‌మూర్తి భవన్‌లో ఉన్న నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును.. 'ప్రధానమంత్రుల మ్యూజియం'గా మారుస్తూ కేంద్రం నిర్ణ‌యించింది.

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మ్యూజియం పేరును మార్చాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. "భారత మొదటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ నుంచి నేటి నరేంద్ర మోడీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు దేశానికి చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుంది.

అందుకే దీని పేరును మారుస్తూ చేసిన ప్రతిపాదన స్వాగతించదగినది. ప్రధానులందరి ప్రయాణం ఒక ఇంద్రధనస్సు వంటింది. అది అందంగా ఉండాలంటే ఇంద్రధనస్సులోని రంగులన్నీ సమపాళ్లలో ఉండాలి'' అని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

మోడీపై కాంగ్రెస్ ఫైర్‌

మోడీ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది వారి చెడు బుద్ధి, నియంతృత్వ ధోరణిని తెలియజేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. బీజేపీని విమర్శించారు. ఏ చరిత్ర లేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేస్తారని ఆయన అన్నారు. 59 ఏళ్లకు పైగా అంతర్జాతీయ మేధో భాండాగారంగా విరాజిల్లుతూ.. ఎన్నో పుస్తకాలకు నిలయంగా ఉన్న ఈ మ్యూజియం పేరు మార్చడం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

సంకుచిత మనస్తత్వం, ప్రతీకార రాజకీయాలకు మోదీ మారుపేరుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అభద్రతాభావంతో ఉండే ఓ అల్పవ్యక్తి విశ్వగురువు అని ప్రచారం చేసుకుంటున్నారని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.