Begin typing your search above and press return to search.

గుజరాతీ అయిన మోడీకి.. 'గాంధీ' పై ఎందుకు ద్వేషం

By:  Tupaki Desk   |   24 May 2023 7:00 AM GMT
గుజరాతీ అయిన మోడీకి.. గాంధీ పై ఎందుకు ద్వేషం
X
సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి రోజుకో కొత్త వివాదం వచ్చి పడుతూనే ఉంది. ఈ నెల 28న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.

అయితే ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాల మధ్య రోజుకో వాగ్వాదం నడుస్తోంది. రాష్ట్రపతితో భవనం ప్రారంభించవలసిందని ప్రతిపక్ష నేతలు ఓ వైపు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు హిందూ సిద్ధాంతకర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి రోజునే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించడం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

సావర్కర్‌ జయంతి మే,28ని పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ప్రభుత్వం నిర్ణయించింది. సావర్కర్‌ను ప్రతిపక్షాలు ఓ విభజనవాదిగా పరిగణిస్తాయి. అధికార పార్టీ బిజెపి దృష్టిలో మాత్రం సావర్కర్‌ ఒక హీరో.

ఈ క్రమంలో మే,28ని ఎన్నుకోవడం అంటే భారతదేశ వ్యవస్థాపకులను అవమానించినట్లేనని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. మహాత్మగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్‌ జయంతి రోజును ముహూర్తంగా ఎందుకు పరిగణిస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపి జైరామ్‌ రమేష్‌ విమర్శిస్తున్నారు.

భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం గతవారమే ప్రకటించింది. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును పక్కన పెట్టడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్రపతి చేతుల మీదే ప్రారంభించాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహూల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

పార్లమెంటు గణతంత్ర భారత సర్వోన్నత వ్యవస్థ అని ఆయన అన్నారు. పార్లమెంటుకు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి అధిపతి అని పేర్కొన్నారు. ముర్ము ఈ భవనాన్ని ప్రారంభిస్తే అది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక అవుతుందని కాంగ్రెస్‌ అధ్యకక్షులు మల్లికార్జున్‌ ఖర్గే ట్వీట్‌ చేశారు.

అయితే కాంగ్రెస్‌ నాయకుల విమర్శలకు బిజెపి కూడా ఘాటుగానే స్పందించింది. శుభసమయాల్లో రాహుల్‌ గాంధీ అపశకునంలా అడ్డుతగులుతారని బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్‌ భాలియా అన్నారు. చారిత్రక క్షణాలను ఆహ్వానించేందుకు రాహూల్‌కు ఇష్టం లేదని అన్నారు.

అయితే ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2020లో ఈ భవన శుంకుస్థాపనకు కూడా ప్రతిపక్షాలు రాలేదు. అయితే అప్పట్లో కోవిడ్‌ విజృంభన ఇందుకు కారణం.