Begin typing your search above and press return to search.

5జీ సరిగా రాలేదు.. అప్పుడే 6జీ మీద ఫోకస్

By:  Tupaki Desk   |   26 March 2023 10:00 AM GMT
5జీ సరిగా రాలేదు.. అప్పుడే 6జీ మీద ఫోకస్
X
2జీ వచ్చింది.. ఆ వెంటనే 3జీ వచ్చింది. కాస్తంత కుదురుకునేలోనే 4జీ వచ్చేయటం.. కాసిన్ని రోజులు గడిచాయో లేదో 5జీని తీసుకొచ్చేశారు. దేశంలో ఇప్పటికే 125 నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటి వేళలోనే కేంద్రంలోని మోడీ సర్కారు.. భవిష్యత్తులో తీసుకురావాల్సిన 6జీ మీద కసరత్తు షురూ చేయటమే కాదు.. దీనికి సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

అన్ని అనుకున్నట్లు జరిగితే.. దేశంలో 2030నాటికి 6జీను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లానింగ్ మొదలైంది. 6జీ వచ్చినంతనే.. ప్రజాజీవనంలోనూ.. సామాజికంగా సమూల మార్పులకు కారణమవుతుందని చెబుతున్నారు. 6జీని ఒక మిషన్ మాదిరి చేపట్టి.. ఈ సాంకేతికతమై ఫోకస్ పెట్టిన దక్షిణ కొరియా.. చైనా.. జపాన్ లాంటి దేశాలతో పోటీ పడనున్నట్లుగా కేంద్రం చెబుతోంది.

ఇతర ఖర్చులకు జేబులో డబ్బులు ఉన్నా లేకున్నా.. మొబైల్ ఫోన్.. అందులో డేటా మాత్రం తప్పనిసరి అయ్యింది. అది లేకుండా బతకలేని పరిస్థితికి వచ్చేసి చాలాకాలమే అయ్యింది. ప్రస్తుతం దేశ ప్రజలు 100 కోట్ల మొబైల్ ఫోన్లు వాడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇంటర్నెట్ వాడకం కూడా భారీగా పెరిగింది. డేటా వినియోగంలో దూసుకెళ్లిపోతున్న పరిస్థితి. 2014లో ఇంటర్నెట్ వాడే వారు పాతిక కోట్లు ఉంటే.. ఇప్పుడు అది కాస్తా 85 కోట్లకు చేరుకోవటం తెలిసిందే. ఈ లెక్కన డేటా వినియోగం జెట్ స్పీడ్ లో వ్రద్ధి చెందుతున్న విషయం స్పష్టమవుతుంది.

ప్రస్తుతం 30 కోట్ల ఇళ్లకుచెందినవారు ఏడాదికి 16 కోట్ల కంటే ఎక్కువగానే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసు్తున్నారు. ప్రతి ఇంట్లోని వారు ప్రతి రెండేళ్లకు ఒకసారి కొత్త ఫోన్ కొంటున్నారని చెప్పక తప్పదు. దీనికితోడు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మొబైల్ ఫోన్.. అందులోని డేటాతో పొందుతున్న సేవలు అన్ని ఇన్ని కావు. వాలెట్ లు.. ఆన్ లైన్ పేమెంట్లు.. బుకింగ్ లు.. వినోదం.. ఇలా ప్రతి విషయం మొబైల్ మాథ్యమంలో సాగుతున్న సంగతి తెలిసిందే.

దేశంలో 5జీ ఇంకా అందుబాటులోకి రాక ముందే 6జీ మీద ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 5జీ కంటే దీని నెట్ స్పీడ్ వంద రెట్లు వేగంగా ఉంటుందని చెబుతున్నారు. సెకన్ కు ఒక టెరాబైట్ స్పీడ్ తో పని చేస్తుందని చెబుతన్నారు. క్షణం కూడా ఆలస్యం కాకుండానే డేటా బదిలీ అవుతుందని.. భవిష్యత్తులో ఈ సాంకేతికత కీలకం కానున్నట్లు చెబుతున్నారు. 6జీ ప్రమాణాలు.. స్పెక్ట్రమ్ ల గుర్తింపుతోపాటు సిస్టమ్స్.. డివైజ్ లకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు.. పరిశోధన.. అధ్యయనాలకు అవసరమైన ఆర్తిక సాయాన్ని అందించేందుకు మోడీసర్కారు ఒక అత్యున్నత కౌన్సెల్ ను ఏర్పాటు చేయటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. 6జీ సేవల్ని ప్రపంచంలో అందరి కంటే ముందు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా దక్షిణ కొరియా ప్రయత్నం చేస్తోంది. ఆ దేశ అంచనాల ప్రకారం వచ్చే ఏడాదికి 6జీ తొలిదశను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 6జీ సేవలపై జపాన్ సైతం ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. చైనా విషయానికి వస్తే.. ఐదేళ్ల క్రితమే అంటే 2018లోనే 6జీ సేవల గురించి పరిశోధనలు షురూ చేసింది. 2029లో అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది. అమెరికా కూడా ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేయటంతో పాటు గూగుల్.. యాపిల్ వంటి కంపెనీలతోకలిసి పని చేస్తోంది.

6జీ అందుబాటులోకి వస్తే ఏం జరగనుంది?

- వేగం ఊహించనంత పెరుగుతోంది. మనిషి జీవితం సమూలంగా మారుతుంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య దూరం తగ్గుతుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకుంటాయి.

- రిమోట్ కంట్రోల్ తో ఫ్యాక్టరీలను నిర్వహించటమే కాదు.. రియల్ టైం గేమింగ్ ఇండస్ట్రీకి కొత్త హంగులు వస్తాయి. సెల్ఫ్ డ్రైవ్ చేసే కార్లు రోడ్ల మీద పరుగులు తీస్తాయి. డేటా బదిలీ అన్నది క్షణం కూడా ఆలస్యం లేకుండా సాగుతుంది.

- డేటా బదిలీలో ఆలస్యం అన్నది లేని కారణంగా సదూర తీరాన ఉండి కూడా రోబోటిక్ సర్జరీలు చేసేందుకు సాయం చేసే వీలుంది. 6జీ సపోర్టుతో నడిచే డివైజ్ లు అన్నీ బ్యాటరీలతో నడుస్తాయి. బ్యాటరీ రంగం పరుగులు తీస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో దశకు చేరుకుంటుంది.

- ఒకేసారి అత్యధిక డివైజ్ లకు నెట్ కనెక్షన్లు ఇవ్వొచ్చు. 5జీతో పోలిస్తే 6జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పది రెట్లు ఎక్కువ పరికరాలకు 6జీ కనెక్షన్ ను ఇచ్చే వీలుంది.