Begin typing your search above and press return to search.

ఏంది మోడీ 3 నిమిషాల మాటకు.. గులాబీ దళం ఇంత సీరియస్సా?

By:  Tupaki Desk   |   9 April 2023 11:14 AM GMT
ఏంది మోడీ 3 నిమిషాల మాటకు.. గులాబీ దళం ఇంత సీరియస్సా?
X
కేంద్రంలోని మోడీ సర్కారుకు.. రాష్ట్రంలోని తెలంగాణ సర్కారుకు మధ్య రచ్చ అంతకంతకూ పెరుగుతున్న వేళ.. రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయి ఉన్న సమయంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్ని మరింత హాట్ హాట్ గా మార్చారని చెప్పాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత దాదాపు రూ.11 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనులు.. ప్రారంభోత్సవాలు చేసిన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు.

క్లుప్తంగా సాగిన మోడీ ప్రసంగంలో తెలంగాణలోని కేసీఆర్ సర్కారు పై ఆయన మూడు నిమిషాల పాటు విమర్శలు చేశారు. నిజానికి.. ఇదేమీ పెద్ద సమయం కూడా కాదు. అది కూడా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఒకట్రెండు మాటలు కాస్తంత కటువుగా ఉన్నా.. మిగిలిన మాటలన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడినవే అన్న అభిప్రాయం కలిగేలా చేశాయి. కానీ.. ప్రధాని మోడీ విమర్శలకు గులాబీ దళం నుంచి మాత్రం రియాక్షన్ భారీగా వచ్చిందని చెప్పాలి. ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఫాలో కాకుండా.. బీఆర్ఎస్ నేతల కౌంటర్లు చూస్తే మాత్రం.. ఏంటి ప్రధాని ఘాటైన వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగక మానదు.

కానీ.. ప్రధాని స్పీచ్ ను ఫాలో అయి.. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల స్పందనను చూస్తే.. మాత్రం ఆ మాత్రం దానికి మరీ ఇంతలా రియాక్టు కావాలా? అన్న సందేహం కలగక మానదు. మంత్రులు హరీశ్ రావు మొదలు కొని పలువురు మంత్రులు.. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తమ గళాన్ని విప్పిన తీరు.. సంధించిన విమర్శనాస్త్రాల్ని చూస్తే మాత్రం మరీ ఇంత భారీగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.

కొందరు మంత్రులు అయితే ఒకట్రెండు అడుగులు ముందుకేసీ.. తెలంగాణ ప్రయోజనాల మీదా.. మోడీ పర్యటన కారణంగా తెలంగాణకు ఒరిగిందేమిటన్న విషయాల్ని చెప్పే కన్నా.. అదానీ ఇష్యూను ప్రస్తావించటం విశేషం. అంతేకాదు..ప్రధానమంత్రి తన అధికారిక కార్యక్రమాల్లో పాటించాల్సిన విధానాల్ని పాటించకుండా పార్టీ కార్యక్రమం మాదిరి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు పలువురు మండిపడ్డారు.

అయితే.. మోడీ టూర్ ను.. ఆయన తీరును తప్పు పట్టే వేళలో.. గులాబీ బాస్ తమ అధినేత కేసీఆర్ ఏం చేశారు? అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్న హితవును కమలనాథుల నోట రావటం గమనార్హం. మొత్తంగా మోడీ ప్రసంగంలో ప్రస్తావించిన మూడు నిమిషాల విమర్శలు.. ఆరోపణలకు బీఆర్ఎస్ నేలు మరీ ఇంతలా రియాక్టుకావాలా? అన్న సందేహాన్నిపలువురు వ్యక్తం చేయటం గమనార్హం.