Begin typing your search above and press return to search.

ఆధునిక బానిసత్వం ఈ దేశాల్లోనే అధికం!

By:  Tupaki Desk   |   26 May 2023 1:03 PM GMT
ఆధునిక బానిసత్వం ఈ దేశాల్లోనే అధికం!
X
పూర్వం రాజ్యాలు ఉండేవి. కొంతమంది రాజులు నియంతల్లా పరిపాలించేవారు. ప్రజలను బానిసల్లా చూసేవారు. తరతరాలుగా ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయేవారు. ఆ తర్వాత రాజ్యాలు, రాజులు అంతరించిపోయారు. బానిసత్వం కూడా చాలా వరకు తగ్గిపోయింది. అయితే ప్రజాస్వామ్యం వెల్లివిరిశాక ''ఆధునిక బానిసత్వం'' చోటు చేసుకుంది.

తాజాగా ఇలా ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న ప్రజలు ప్రపంచంలో ఐదు కోట్ల మంది ఉన్నారని ఆస్ట్రేలియా కు చెందిన వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ బాంబుపేల్చింది. ఈ వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ అనేది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ కావడం గమనార్హం.

ప్రపంచంలో ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా అంటే 2.5 కోట్ల మందికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నారని వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ తాజాగా ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. మొత్తం 172 పేజీల్లో విడుదల చేసిన నివేదికలో భాగంగా అనేక సంచలన విషయాలను సంస్థ వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. బలవంతపు చాకిరీ లేదా బలవంతపు వివాహాలతో 'ఆధునిక బానిసత్వం'లో జీవిస్తున్నవారిలో ఎక్కువమంది జీ–20లోని ఆరు దేశాల్లోనే ఉన్నారు. సంఖ్యాపరంగా.. అత్యధికంగా మనదేశంలోనే ఇలాంటివారు 1.1 కోట్ల మంది ఉండగా.. చైనా (58 లక్షల మంది), రష్యా (19 లక్షలు), ఇండోనేసియా (18 లక్షలు), తుర్కియే (13 లక్షలు), అమెరికా (11 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో బానిసత్వం ఉంది. నివేదిక రూపకల్పనలో భారీ ఎత్తున ఇంటింటి సర్వేలు, బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు 'వాక్‌ ఫ్రీ' సంస్థ వెల్లడించింది. ఆధునిక బానిసత్వం సమాజం లోని ప్రతి అంశానికీ వ్యాపించింది అని వాక్‌ ఫ్రీ వ్యవస్థాపక డైరెక్టర్‌ గ్రేస్‌ ఫారెస్ట్‌ వెల్లడించారు.

2021 ఆఖరునాటికి ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్న 5 కోట్ల మందిలో 2.8 కోట్ల మంది బలవంతపు చాకిరీలో, 2.2 కోట్ల మంది బలవంతపు వివాహాలతో మగ్గుతున్నారు.

నివేదిక ప్రకారం.. 'ఆధునిక బానిసత్వం'... ఉత్తర కొరియా, ఎరిట్రియా, మారిటేనియా, సౌదీ అరేబియా, తుర్కియాల్లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి దేశంలోనూ అనేక రంగాల్లో బలవంతపు చాకిరీ కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది.