Begin typing your search above and press return to search.

ప్ర‌మాణ‌స్వీకారానికి ఒక్క‌డిగానే వ‌చ్చాడు

By:  Tupaki Desk   |   15 May 2017 11:05 AM GMT
ప్ర‌మాణ‌స్వీకారానికి ఒక్క‌డిగానే వ‌చ్చాడు
X
ఆర్థిక ఆరోప‌ణ‌ల‌తో ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కుతూ వ‌చ్చిన వాకాటి నారాయ‌ణ‌రెడ్డి తాజాగా త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి ప్ర‌మాణ‌ స్వీకారం చేశారు. ఏపీ అధికార‌ప‌క్షం త‌ర‌ఫున ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆయ‌న‌పై.. పెద్ద ఎత్తున ఆర్థిక ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భారీగా డ‌బ్బులు ఖ‌ర్చు చేసి విజ‌యం సాధించినట్లుగా ఆరోప‌ణ‌లున్న ఆయ‌న ఇంటిపైన ఐటీ అధికారులు ఇటీవ‌ల‌ దాడులు నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు స‌న్నిహితులు.. బంధువుల ఇళ్ల‌పైనా త‌నిఖీలు చేప‌ట్టారు. వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.450 కోట్ల మేర బ‌కాయిలు ఉన్న వాకాటిని విల్ ఫుల్ డిఫాల్ట‌ర్ గా తేల్చేందుకు సీబీఐ సోదాలునిర్వ‌హించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌ప‌నై వచ్చిన ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు వాకాటి ఒంట‌రిగానే మండ‌లి ఛైర్మ‌న్ చ‌క్రపాణి వ‌ద్ద‌కు వ‌చ్చారు. పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న వెంట ఎవ‌రూ రాలేద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్ర‌మాణ‌స్వీకారం నేప‌థ్యంలో వాకాటి మాట్లాడుతూ.. త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌టంపై స్పందిస్తూ.. అధినేత తీసుకున్న నిర్ణ‌యానికి తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్పారు. తన‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసినా.. తాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో క‌లిసి ప‌ని చేస్తాన‌ని.. త‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చిన చంద్ర‌బాబు.. లోకేశ్ ల‌కు థ్యాంక్స్ చెప్పుకున్నారు.

బ్యాంకులో రుణాలు తీసుకున్న మాట వాస్త‌వ‌మేనని.. వాటి చెల్లింపుల విష‌యంలో జాప్యం జ‌రిగింద‌ని.. రుణాల్ని రీస్ట్ర‌క్చ‌ర్ చేసే అంశంపై ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని.. రెండు మూడు నెల‌ల్లో అంంతా స‌ద్దుకుంటుంద‌ని చెప్పారు. క‌డిగిన ముత్యంలా తాను ఈ ఇష్యూ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాన‌ని చెప్పారు. వాకాటితో పాటు.. టీడీపీ ఎమ్మెల్సీగా ఎంపికైన శ‌త్రుచర్ల విజ‌య‌రామ‌రాజు కూడా ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.