Begin typing your search above and press return to search.

బాబుకు దిమ్మ తిరిగిపోయేలా మ‌రో షాక్‌

By:  Tupaki Desk   |   2 Aug 2017 7:01 AM GMT
బాబుకు దిమ్మ తిరిగిపోయేలా మ‌రో షాక్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో బాబు తీసుకున్న నిర్ణ‌యానికి ఆయ‌న భారీ మూల్యాన్ని చెల్లించే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. భూమా వ‌ర్గానికి.. శిల్పా వ‌ర్గానికి న‌డుస్తున్న రాజ‌కీయ వైరంలో బాబు భూమా వ‌ర్గానికి త‌లొగ్గ‌టం.. శిల్పాను ప‌క్క‌న పెట్ట‌టం తెలిసిందే. దీంతో.. చిన్న‌బుచ్చుకున్న శిల్పా జ‌గ‌న్ పార్టీలో చేరుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

నంద్యాల అసెంబ్లీలో మాంచి ప‌ట్టు ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీ నుంచి వీడిపోవ‌ట‌మే కాదు.. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థిగా మార‌టం ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో.. నంద్యాల స్థానాన్ని చేజిక్కించుకోవ‌టం కోసం ఆయ‌న కిందామీదా ప‌డుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న చంద్ర‌బాబు.. ఆ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున హామీలు ఇవ్వ‌టం.. ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇవ్వ‌టం విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా చేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న‌కు మ‌రో భారీ షాక్ త‌గిలింది.

శిల్పా మోహ‌న్ రెడ్డి సోద‌రుడు.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి అన్న‌బాట‌లో ప‌య‌నించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కార్య‌క‌ర్త‌లు.. అనుచ‌రుల స‌ల‌హా మేర‌కు ఆయ‌న ఏపీ అధికార‌ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

అదే స‌మ‌యంలో రేపు (గురువారం) నంద్యాలలో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ఏపీ విప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. పార్టీ చేర‌నున్న నేప‌థ్యంలో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసేందుకు హైద‌రాబాద్ వెళ్ల‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

టీడీపీ కోసం ఎంతగానో ప‌ని చేస్తున్నా.. ప‌ట్టించుకోకుండా నిన్నా మొన్న వ‌చ్చిన వారికి పెద్ద‌పీట వేయ‌టం ప‌ట్ల శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌లు.. అనుచ‌రులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. టీడీపీలో ఉన్నంత కాలం అవ‌మానాలు త‌ప్పేట‌ట్లు లేవ‌ని.. అందుకే గౌర‌వంగా ఉండే చోట ఉందామంటూ మండిప‌డిన వారు.. పార్టీ మారాల‌న్న నిర్ణ‌యాన్ని తేల్చి చెప్పారు. దీంతో.. జ‌గ‌న్ పార్టీలోకి చేరేందుకు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని చెప్పాలి.