Begin typing your search above and press return to search.

అత్యంత దురదృష్ట ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం చేశారు

By:  Tupaki Desk   |   25 April 2016 10:20 AM GMT
అత్యంత దురదృష్ట ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం చేశారు
X
ఈ ఉదంతం విన్నప్పుడు.. అయ్యో అన్న మాట ఎవరినోటి నుంచైనా రావాల్సిందే. బ్యాడ్ లక్ కు కేరాఫ్ అడ్రస్ గా అనిపించే నరేశ్ కుమార్ రెడ్డి తాజాగా ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. అదేంటి..? ఇప్పుడేమి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగలేదు కదా? అన్న డౌట్ రావొచ్చు. నిజమే.. ఎన్నికలు జరగకున్నా.. ఎమ్మెల్సీగా ఎలా ఎంపికయ్యారన్న ప్రశ్న వేస్తే.. దాదాపు ఐదేళ్ల వెనక్కి వెళ్లాల్సిందే.

2011లో ఏపీ స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిప్పారెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేశ్ కుమార్ రెడ్డి ఒక్క ఓటుతో ఓటమి చెందినట్లుగా లెక్క తేల్చారు. దీంతో తిప్పారెడ్డి విజేతగా నిలిచారు. అయితే.. తనకు.. తిప్పారెడ్డికి సమాన ఓట్లు వచ్చాయంటూ వాదిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నరేశ్ కుమార్ రెడ్డి. అయితే.. ఆయన వాదనను ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తిప్పారెడ్డి.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మదనపల్లి స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు తనకు జరిగిన అన్యాయం మీద నరేశ్ కుమార్ రెడ్డి న్యాయపోరాటం చేపట్టారు. ఇలా కాలగర్భంలో దాదాపు ఐదేళ్లు పూర్తి అయ్యాక హైకోర్టు ధర్మాసనం తన తీర్పును చెబుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరువరికి సమాన ఓట్లు వచ్చాయని.. లాటరీలో నరేశ్ కుమార్ రెడ్డి విజేతగా నిలిచారంటూ తీర్పు ఇచ్చారు. తాను మొదటి నుంచి ఏ వాదన అయితే వినిపించానో అదే నిజమని తేలిందంటూ నరేశ్ కుమార్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం ఆరేళ్ల పదవీకాలానికి ఐదేళ్లు గడిచిన తర్వాత ఏడాది పదవీ కాలానికి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టటం చూసినప్పుడు.. ఆయనెంత దురదృష్టవంతుడో ఇట్టే అర్థం కాక మానదు.