Begin typing your search above and press return to search.

ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవిత విచారణ సాగేది ఇలానా?

By:  Tupaki Desk   |   11 March 2023 10:24 AM GMT
ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవిత విచారణ సాగేది ఇలానా?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ కీలక దశకు చేరుకోవటం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కాంలో భాగంగా ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలుపాలు కావటం తెలిసిందే. ఈ స్కాంలో పాత్రదారులుగా చెబుతున్న పలువురు నిందితులు ఇప్పటికే జైల్లో ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కార్యాలయంలో ఈ రోజు విచారించనున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న కవిత.. ఈ రోజు 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. మరి.. ఈ రోజు విచారణ ఎలా సాగుతుంది? అన్నది ఒక ప్రశ్న అయితే.. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందన్నది మరో చర్చ. ఆమెను అరెస్టు చేసే విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. కీలక వ్యాఖ్య చేసిన నేపథ్యంలో.. ఆమె అరెస్టు ఖాయమని చెబుతున్నారు.

అయితే.. మిగిలిన వారి మాదిరి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయటం అంత తేలిక కాదంటున్నారు. ఈ విషయంలో ఈడీ సైతం భారీగా కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. సరైన ఆధారాలు.. గట్టి సాక్ష్యాలు లేకుండా అడుగు ముందుకువేస్తే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. తమ విచారణలో భాగంగా ఎక్కువగా కవిత పెద్ద సంఖ్యలో మార్చిన ఫోన్ల వ్యవహారం కీలకంగా మారనుంది.

కొన్ని ఖరీదైన ఫోన్లను మార్చటం.. వాటిని ధ్వంసం చేయటం మీదా ఎమ్మెల్సీ కవితకు కొన్ని ప్రశ్నలు ఎదురు కావొచ్చంటున్నారు. విచారణలో భాగంగా ఆమెకు బినామీగా భావిస్తున్న పిళ్లైను సైతం ఆమెముందు ఉంచుతారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఇరువురుని వేర్వేరుగా.. కలిపి విచారిస్తారని.. ఇద్దరిని పలు ప్రశ్నలు సంధిస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మనీశ్ సిసోడియాను తాజాగా ఈడీ కస్టడీలోకి తీసుకుంది. దీంతో.. కవితను విచారించే వేళలో.. ఆయన్ను కూడా కలిపి విచారించే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ఈ సందర్భంగా వచ్చే అవుట్ పుట్ ఆధారంగా ఈడీ తదుపరి నిర్ణయాన్ని తీసుకునే వీలుందని చెబుతున్నారు. విచారణ అనంతరం ఈడీ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎన్ని అన్నప్పుడు దానిపైనా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.

ఒక అంచనా ప్రకారం.. కవిత అరెస్టుకు 50 శాతం ఎస్ అయితే.. 50 శాతం నో అనే మాట వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే సరిపోతుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.