Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నోటికే కాదు.. కారుకు స్పీడెక్కువ

By:  Tupaki Desk   |   21 Feb 2023 9:56 AM GMT
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నోటికే కాదు.. కారుకు స్పీడెక్కువ
X
రాజకీయం అన్న తర్వాత నాలుగు మాటలు అనుకోవటం అలవాటుగా మారింది. నోటికి కళ్లాలు వేసుకొనే రోజులు పోయి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఇప్పుడో అలవాటుగా మారింది.ఎంత బరితెగించి మాట్లాడితే అంత భవిష్యత్తు అన్నట్లుగా మారింది. అలాంటి వారికే పేరుప్రఖ్యాతులు రావటం.. ప్రజల్లో గుర్తింపు పెరగటం ఈ మధ్యన ఎక్కువైంది. అలా తరచూ ప్రజల నోళ్లలో నానే వ్యక్తులకు పార్టీ అధినేతలు అవకాశాలు కల్పిస్తున్నారు. ఎంత దూకుడుగా ఉంటే అంతగా దూసుకెళ్లొచ్చన్నట్లుగా మారిన తీరుకు తగ్గట్లే.. అవకాశాలు వస్తున్నాయి.

నోటికి పని చెప్పే నేతలకు పదవులు అప్పజెప్పే ధోరణి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువైంది. దీంతో.. దూకుడుగా మాట్లాడే ధోరణిని పెంచుకుంటున్నారు. అలాంటి నేతల్లో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒకరు. ఈ మధ్యన ఆయన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన వైనంపై జాతీయ మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన్ను తమ ముందుకు హాజరు కావాలని ఆదేశించటం తెలిసిందే.

ఎవరినైనా.. ఎంత మాట అయినా అనేసే కౌశిక్ రెడ్డి నోటికే కాదు.. ఆయన కారుకు కూడా పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆయన కారుకు ఉన్న చలానాల్ని చూస్తే.. ఆయన కారుకు ఎంత దూకుడు ఎక్కువన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆయనకు చెందిన టయోటా ఇన్నోవా పెద్ద ఎత్తున చలానాలు పెండింగ్ ఉన్న విషయం బయటకు వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ దూసుకెళ్లే కౌశిక్ రెడ్డి కారు మీద ఏకంగా పదమూడు చలానాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

మితిమీరిన వేగం.. నో పార్కింగ్ వద్ద కారును నిలపటంతో పాటు.. స్టాప్ లైన్ క్రాసింగ్.. ఇలా పలు తప్పులు చేసిన నేపథ్యంలో ఆయన కారు మీద పదమూడు చలానాలు ఉండటమే కాదు.. వాటి విలువ రూ.12వేలకు పైనే ఉన్న విషయాన్ని గుర్తించారు. కౌశిక్ రెడ్డికి నోటికే కాదు ఆయన కారుకు కూడా స్పీడెక్కువన్న విషయం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ స్పీడ్ కు కళ్లాలు వేయకుంటే కష్టాలు తప్పవన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.