Begin typing your search above and press return to search.

'నర్తు'కు ఎమ్మెల్సీ.. ఇచ్ఛాపురం కోటను కొట్టేందుకేనా?

By:  Tupaki Desk   |   21 Feb 2023 3:00 PM GMT
నర్తుకు ఎమ్మెల్సీ.. ఇచ్ఛాపురం కోటను కొట్టేందుకేనా?
X
ఏపీలో పాదయాత్రలు ముగిసే నియోజకవర్గంగా పేరు తెచ్చుకున్న ఇచ్ఛాపురంలో ఇంతవరకు వైసీపీ గెలవలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌నే విజయం వరించింది. దీంతో ఎలాగైనా ఈసారి ఇక్కడ బోణీ చేయాలన్న వ్యూహంలో భాగంగానే పార్టీలోని అన్ని వర్గాలను సంతృప్తిపరిచి, ఏకతాటిపై తెచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు జగన్. ఇందులో భాగంగానే ఇచ్ఛాపురం నుంచి నర్తు రామారావుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.

నర్తు రామారావు గతంలో రెండుసార్లు ఇచ్ఛాపురం అసెంబ్లీకి పోటీచేసినా విజయం సాధించలేకపోయారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలవగా 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో ఆయన స్థానంలో పిరియా సాయిరాజ్‌కు వైసీపీ టికెట్ ఇవ్వగా ఆయన కూడా ఓటమి పాలయ్యారు. సాయిరాజ్ 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఇదే నర్తు రామారావుపై గెలిచారు. అయితే... 2014 తరువాత ఆయన కూడా వైసీపీలోకి రావడంతో రామారావుకు టికెట్ దొరకలేదు. సాయిరాజు టికెట్ దక్కించుకున్నా విజయం దక్కించుకోలేకపోయారు.

ప్రస్తుతం ఇచ్ఛాపురం వైసీపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కోవర్గంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేశ్ కుమార్ అగర్వాల్ ఓ వర్గంగా... నర్తు రామారావు ఓ వర్గంగా.. పిరియా సాయిరాజ్ ఓ వర్గంగా ఉన్నారు. అదేసమయంలో టీడీపీ మాత్రం బెందాళం అశోక్ నేతృత్వంలో కలిసికట్టుగా సాగుతోంది. సర్వేలు కూడా వచ్చే సారి కూడా అశోక్‌దే గెలుపని సూచిస్తుండడంతో ఈ నియోజకవర్గ వైసీపీని దారిలో పెట్టేందుకు విజయం దిశగా నడిపించేందుకు వ్యూహం రచించారు. అందులో భాగమే నర్తు రామారావుకు ఎమ్మెల్సీ అవకాశం.

ఇచ్ఛాపురంలో రెండో బలమైన సామాజికవర్గమైన యాదవ కులానికి చెందిన నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా ఆయన నుంచి మద్దతు దొరకనుంది. ఈ మేరకు ఇప్పటికే రామారావును ఒప్పించినట్లు సమాచారం. నర్తుకు ఎమ్మెల్సీ టికెట్ దొరకడంతో తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని పిరియా సాయిరాజ్ భావిస్తున్నారు. అయితే, సాయిరాజ్ భార్య ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉండడంతో దాన్ని కారణంగా చూపుతూ నరేశ్ కుమార్ అగర్వాల్ కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టికెట్ ఎవరికి వచ్చినా కూడా బలమైన నాయకుడైన నర్తు రామారావు నుంచి, ఆయన సామాజికవర్గం యాదవుల నుంచి మద్దతు లభించనుండడంతో వైసీపీ బలం పెరగనుంది. అయితే.

సౌమ్యుడిగా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడిగా... డాక్టరుగా మంచిపేరున్న బెందాళం అశోక్ ప్రాబల్యం ఏమాత్రం తగ్గకపోవడంతో ఇక్కడ పాగా వేయాలన్న వైసీపీ కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.