Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రారంభ‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. వైసీపీ, టీడీపీల్లో ఉత్కంఠ‌!

By:  Tupaki Desk   |   13 March 2023 10:15 AM GMT
ఏపీలో ప్రారంభ‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. వైసీపీ, టీడీపీల్లో ఉత్కంఠ‌!
X
రాష్ట్రంలో అత్యంత కిలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయులు, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయ బద్దంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగే అన్ని నియోజక వర్గాలకు సీనియర్ ఐఏఏస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు మూడు పట్టభద్రుల నియోజక వర్గ స్థానాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపూర్-కర్నూలు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గ స్థానాలకు అదే విధంగా శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలకు వైసీపీ, టీడీపీ మ‌ద్ద‌తుతో అభ్య‌ర్థులు త‌ల‌ప‌డుతున్నారు.

ఆయా ఎమ్మెల్సీ నియోజక వర్గాలలో ఎన్నికలను అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ఇతర ఉపాధ్యాయ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీని ఓడించ‌డం ద్వారా.. రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పున‌కు నాందిప‌ల‌కాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపునిచ్చారు. మ‌రోవైపు.. వైసీపీ నేత‌లు.. ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది ఇలా ఉంటే అనంతపూర్, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానాలకు వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక అయిన విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు, 3 పట్టభద్రుల స్థానాలకు 108 మంది, 2 ఉపాధ్యాయ స్థానాలకు 20 మంది, 3 స్థానిక సంస్థల స్థానాలకు 11 మంది అభ్యర్థులు మొత్తంగా 139 మంది అభ్యర్ధులు భరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 16న జరగనుంది.

అదే రోజు అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. ఈ ఎన్నిక‌ల‌ను వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రానికి సెమీఫైన‌ల్‌గా భావిస్తున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.