Begin typing your search above and press return to search.

ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయటానికి 5 నిమిషాలు పడుతుందట

By:  Tupaki Desk   |   27 Feb 2021 10:30 AM GMT
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయటానికి 5 నిమిషాలు పడుతుందట
X
ఓటు వేయటానికి ఎంతసేపు పడుతుంది? అరనిమిషం.. కాదంటే నిమిషం. అంతకు మించి ఎక్కువ సేపు పట్టటానికి అవకాశమే ఉండదు. కానీ.. తాజాగా తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వారికి ఐదు నిమిషాల సమయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. ఎందుకిలా? అంటే.. రెండు చోట్ల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యే అని చెప్పక తప్పదు. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి 93 మంది అభ్యర్థులు బరిలో ఉంటే.. నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి 71 మంది పోటీలో ఉన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన ఓటర్లు తప్పనిసరిగా ప్రత్యేకంగా ఓటు హక్కును కలిగి ఉండాలి. ఓటుహక్కు కావాలంటే కనీసం గ్రాడ్యుయేట్ పూర్తి చేయటం తప్పనిసరి. మిగిలిన ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే.. ఓటింగ్ సమయంలో ఒకరి కంటే ఎక్కువమందికి ఓటు వేస్తే.. ఆ ఓటు చెల్లనిదిగా ఉంటుంది.

కానీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రతి అభ్యర్థికి ఓటు వేసే వీలుంది. కాకుంటే.. ప్రాధాన్యత క్రమం తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికనే తీసుకుంటే.. ప్రస్తుతం బరిలో 93 మంది ఉన్నారు. అంటే.. ఒక ఓటరు 93 మందికి ఓటు వేయొచ్చు. కాకుంటే.. ఫలానా వ్యక్తికి ఒకటో ప్రాధాన్యత.. రెండో ప్రాధాన్యత ఎవరికి.. ఇలా 93 మంది అభ్యర్థులకు.. తమ ప్రాధాన్యతలు తెలుపుతూ.. బ్యాలెట్ పేపర్లో ఉండే బాక్సులో నెంబరును తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈసారి అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉండటంతో.. ఎవరైనా ఒక ఓటరు తమ ఓటును బరిలో ఉన్న అందరు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలంటే.. కనీసం ఐదు నిమిషాల సమయం పడుతుందని లెక్క వేస్తున్నారు. సాధారణంగా ఓటరు ఎవరైనా సరే.. అయితే ఒకరికి.. లేదంటే ఇద్దరు.. కాదంటే ముగ్గురికి ఓటు వేస్తుంటారు. ప్రాధాన్యత క్రమంలో ఒకటో స్థానం.. రెండో స్థానం.. మూడో స్థానం అని ప్రాధాన్యతను పేర్కొంటారు. అలా కాకుండా.. బరిలో ఉన్న అందరికి ఓటు వేసినా తప్పేం కాదు.