Begin typing your search above and press return to search.

చెన్నైకి చేరిన ఆ ఐదుగురు గోవా ఎమ్మెల్యేలు.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   17 July 2022 4:30 AM GMT
చెన్నైకి చేరిన ఆ ఐదుగురు గోవా ఎమ్మెల్యేలు.. కార‌ణ‌మిదే!
X
మ‌ధ్య‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌ల్లో విప‌క్ష పార్టీల ప్ర‌భుత్వాల‌ను కూల్చిన బీజేపీ ఇప్పుడు తాజాగా గోవాలోనూ ఇలాంటి ప‌నుల‌కు శ్రీకారం చుట్టింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్తవానికి గోవాలో బీజేపీనే అధికారంలో ఉంది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావ‌ల్సిన 21 సీట్ల‌కు గానూ బీజేపీకి ఒక సీటు త‌గ్గింది. దీంతో ఇత‌రుల‌ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎన్డీఏ కూట‌మి బ‌లం 25 మంది మాత్రమే.

గోవాలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఆరుగురు ఇటీవ‌ల కాంగ్రెస్ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశానికి హాజ‌రుకాలేదు. బీజేపీతో ట‌చ్ లో ఉన్నవారిలో గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ మైఖేల్ లోబో, గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. అధికారం, పదవి కోసం మైఖేల్ లోబో పాకులాడారని, మరోవైపు కామత్‌.. తనపై ఉన్న కేసులనుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అంతం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడుతోంది.

అందుకే ముందు జాగ్రత్త చర్యగా గోవా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను వెంటనే చెన్నైకి తరలించింది. గోవా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఐదుగురు పార్టీ ఎమ్మెల్యేలను చెన్నైకి పంపేసింది. ఆ ఎమ్మెల్యంతా అక్కడి హోటల్‌లో ఉన్న‌ట్టు సమాచారం. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కార్లోస్ అల్వారెస్, యూరి అలెమో, సంకల్ప్ అమోంకర్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, ఆల్టన్ డికోస్టా చెన్నైలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ గాలం నుంచి వీరిని కాపాడేందుకు గోవా కాంగ్రెస్ ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.

మ‌రోవైపు జూలై 11న‌ గోవా అసెంబ్లీ సమావేశాలకు ఆ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేరుగా వచ్చారు. దీనికి అంతంటికి కారణం గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మైఖేల్ లోబోనే అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం.. మైఖేల్‌ను పదవి నుంచి తప్పించింది. అంతేకాదు.. దిగంబర్ కామత్‌పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు నోటీసులు కూడా పంపింది..