Begin typing your search above and press return to search.

గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరుల ఆరాచకం ఎంతంటే?

By:  Tupaki Desk   |   21 Feb 2023 9:33 AM GMT
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరుల ఆరాచకం ఎంతంటే?
X
నభూతో నభవిష్యతి అన్న మాటను సాధారణంగా మంచి విషయాలకు వాడేస్తుంటారు. కానీ.. ఇక్కడ ఇలాంటి అరాచకానికి వాడాల్సి వచ్చింది. మళ్లీ భవిష్యత్తులో ఇంత ఆరాచకం చూస్తామో లేమో అన్న రీతిలో వ్యవహరించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు. అరాచకానికి పరకాష్ఠంగా సాగిన ఈ ఉదంతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడికి పాల్పడటమే కాదు.. కర్రలతో దొరికిన వారిని దొరికినట్లుగా దాడి చేయటమే కాదు.. పెట్రోల్ పోసి కారును తగలబెట్టిన వైనం ఇప్పడు సంచలనంగా మారింది.

టీడీపీ.. వైసీపీ మధ్య నడుస్తున్న పరస్పర విమర్శల నేపథ్యంలో సోమవారం సాయంత్రం మొదలైన ఆరాచకం అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. వంశీ అనుచరగణం చెలరేగిపోయిన వైనంతో గన్నవరంలోని ప్రజలు ఉలిక్కిపడేలా.. భయాందోళనకు గురయ్యేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. గవన్నవరంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరికి వారు విమర్శలు చేసుకోవటం.. ఘాటుగా రియాక్టు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యే వంశీని విమర్శిస్తే గట్టిగా దాడులు చేస్తామంటూ ఆయన అనుచరులు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తమకు వస్తున్న హెచ్చరికల్ని పోలీసులకు తెలిపేందుకు గన్నవరం పోలీస్ స్టేషన్ కు టీడీపీ నేతలు వెళుతున్నారన్న సమాచారం బయటకు రాగానే.. ఎమ్మెల్యే వంశీకి చెందిన అనుచరులు.. స్థానిక టీడీపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. పోలీసులు వీరిని నియంత్రించే ప్రయత్నం చేసినా.. అందుకు భిన్నంగా వారు ఆవేశంతో ఉండటంతో చూస్తుండిపోయారే తప్పించి.. వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదు.

మరోవైపు వంశీ అనుచరులు పెద్ద ఎత్తున కర్రలు.. రాళ్లు తీసుుకొని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. కుర్చీలు.. టేబుళ్లు పగలకొట్టి.. కంప్యూటర్లను ధ్వంసం చేశారు. తెలుగు యువత నేత కోనేరు సందీప్ ఇన్నోవా కారుపై పెట్రోల్ పోసి తగలెబ్టారు. దాని పక్కనే ఉన్న మరో మూడు కార్లను ధ్వంసం చేశారు. దాదాపు గంట పాటు సాగిన నాన్ స్టాప్ విధ్వంసకాండను చూసినోళ్లంతా షాక్ తిన్న పరిస్థితి. రాజకీయాల్లో విభేదాలు మామూలే కానీ.. మరీ ఈ స్థాయిలో హింసకు పాల్పడటమా? అన్న ప్రశ్న తలెత్తింది.

టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిలో అందరూ వంశీ ప్రధాన అనుచరులే అని చెబుతున్నారు. దాదాపు యాభైకి పైగా అనుచరులతో టీడీపీ కార్యాలయంపై విరుచుకుపడిన వారు.. రావటం రావటమే టీడీపీ బ్యానర్లు.. ఫ్లెక్సీలను కొడవళ్లతో కోసేశారు. ఈ బరితెగింపు దాడికి పాల్పడిన వారిలో పలువురిని గుర్తించారు. వారిలో వంశీకి ప్రధాన అనుచరుడైన ఓలుపల్లి రంగా.. గన్నవరం ఎంపీపీ అనగాని రవి.. బాపులపాడు ఎంపీపీ నగేష్.. భీమవరపు యతేంద్ర.. ఎండీ గౌసాని.. నల్ల ప్రసాద్.. పోతుమర్తి బాబీ.. కొల్లి చిట్టి.. పరంధామయ్య.. సుధాకర్.. త్రిపుర్నేని బాబీ తదితరులు దాడులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. దాడికి చెందిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాడి జరగటానికి కాస్త ముందుగా ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ కార్యాలయం మీదుగా వెళ్లటం.. ఆయన వాహన శ్రేణి అలా వెళ్లిందో లేదో కానీ ఆయన అనుచరులు పలువురు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడటం గమనార్హం. అప్పటివరకు ఎమ్మెల్యే వంశీతో ఉన్న నాయకులు పలువురు తాజా దాడిలో పాల్గొనటం విస్మయానికి గురి చేసింది. దాడికి సంబంధించిన సమాచారం పోలీసులకు ఉన్నా.. ప్రేక్షకపాత్ర పోషించినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ ఆఫీసుపై దాడికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన చేపట్టిన వేళలో మాత్రం పోలీసులు ఆ ప్రయత్నాన్ని నిలువరించే ప్రయత్నం చేయటం గమనార్హం. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు.. పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పై కేసులు నమోదు చేశారు. ఆయన ఆచూకీ ఎక్కడన్న దానిపై ఎవరూ సమాధానం చెప్పటం లేదు. ఆయన ఫోన్ స్విచాఫ్ ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.