Begin typing your search above and press return to search.

ఇదెక్కడి చోద్యం? కాషాయ చొక్కా వేసుకుంటే విప్పదీయించిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   30 April 2021 10:34 AM GMT
ఇదెక్కడి చోద్యం? కాషాయ చొక్కా వేసుకుంటే విప్పదీయించిన ఎమ్మెల్యే
X
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున పలు మున్సిపాలిటీలకు.. కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత పెద్ద ఎత్తున ఉన్న వేళ.. ఎన్నికల్ని ఎలా నిర్వహిస్తారని నిన్నటికి నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని.. రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. సెకండ్ వేవ్ దెబ్బకు ఎన్నికల నిర్వహణపై పలువురు అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా ఎన్నికల్ని పూర్తిచేయాలన్న పట్టుదలతో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్నికల పోలింగ్ లో టీఆర్ఎస్ నేత అనుసరించి విధానాన్ని పలువురు తప్పు పడుతున్నారు. వరంగల్ పట్టణంలోని 34వ డివిజన్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ డివిజన్ లో బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. దీంతో.. బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డివిజన్ బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి బలంగా ఉండటంతో.. వారి అనుచర వర్గం యమా హుషారుగా వ్యవమరిస్తోంది.

పోలింగ్ వేళ.. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎవరికి వారు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్న పలువురు కార్యకర్తలు తమ చొక్కాల మీద కాషాయ చొక్కాలు వేసుకొని పని చేస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాషాయం చొక్కాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ సంరద్భంగా పలువురు కార్యకర్తలు కాషాయ చొక్కాలు వేసుకోగా.. ఎమ్మెల్యే నరేందర్ తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశారు.

అంతేకాదు.. ఆయన అనుచర వర్గం మరింత చెలరేగిపోయి.. బీజేపీ కార్యకర్త ఒకరు ధరించిన కాషాయా చొక్కాను బలవంతంగా విప్పదీసే ప్రయత్నం చేశారు. దీనిపై అక్కడి బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసు అధికారిని నిలదీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. టీఆర్ఎస్ నేతల తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.