Begin typing your search above and press return to search.

దొంగ ఓట్లతోనే నేను గెలిచా: ఎమ్మెల్యే రాపాక హాట్‌ కామెంట్స్‌ వైరల్‌

By:  Tupaki Desk   |   27 March 2023 2:11 PM GMT
దొంగ ఓట్లతోనే నేను గెలిచా: ఎమ్మెల్యే రాపాక హాట్‌ కామెంట్స్‌ వైరల్‌
X
ఏపీలో 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాదరావు గెలుపొందిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ తరఫున పోటీ చేసినవారిలో ఆయన ఒక్కడే గెలిచిన రికార్డును సాధించారు. గెలిచిన కొత్తల్లో తాను వైసీపీ లో చేరనని.. 151 మంది ఎమ్మెల్యేల కి అదనంగా తాను చేరి 152వ వాడిగా ఆ పార్టీలో ఉండటం ఇష్టం లేదన్నారు. జనసేన తరఫున తాను ఒకే ఒక్కడుగా ఉంటానని.. ప్రజా సమస్యల పోరాటం కోసం పనిచేస్తానని అప్పట్లో రాపాక భారీ డైలాగు లే కొట్టారు.

సీన్‌ కట్‌ చేస్తే.. ఆ తర్వాత కొంత కాలాని కే వైసీపీ తో రాపాక వరప్రసాద్‌ అంటకాగుతూ వస్తున్నారు. అసెంబ్లీలో పలు బిల్లుల కు వ్యతిరేకంగా ఓటేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదేశించినా ఆ ఆదేశాలను రాపాక వరప్రసాద్‌ పట్టించుకోలేదు. వైసీపీ కే తన మద్దతు తెలుపుతూ వచ్చారు. వైసీపీ సమావేశాల్లో, ప్రభుత్వ కార్యక్రమాలతో మెడలో వైసీపీ కండువాలను పబ్లిక్‌ గా కప్పుకుని తిరిగినా స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆయనపై అనర్హత వేటు వేయలేదు.

పవన్‌ కల్యాణ్‌ చరిష్మాతో తాను గెలవలేదని.. తన సొంత ఇమేజ్‌ తోనే తాను గెలిచానని రాపాక వరప్రసాద్‌ అప్పట్లో చెప్పుకున్నారు. దీంతో తిక్కరేగిన జనసేన కార్యకర్తలు గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ ఎన్నికల్లో రాపాక కు షాక్‌ ఇచ్చారు. రాపాక ఏరికోరి బరిలో దింపిన వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించారు. చివరకు రాపాక స్వగ్రామంలోనూ జనసేన అభ్యర్థే గ్రామ సర్పంచ్‌ గా గెలుపొందాడు.

అయితే అలాంటి రాపాక ఇప్పుడు నీతిబోధలు చేస్తుండటం పై విస్మయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్‌ చేసిందని.. ఉండి ఎమ్మెల్యే రామరాజు తనను సంప్రదించారని రాపాక సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాను విలువలకు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి జగన్‌ తోనే ఉన్నానన్నారు.

ఇక్కడే రాపాక పై సెటైర్లు పడుతున్నాయి. గత ఎన్నికల్లో సీటు ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ కు ద్రోహం చేసి.. జనసేన పార్టీ కి అన్యాయం చేసి వైసీపీ తో అంటకాగిన రాపాక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థికే ఓటేశారు. మళ్లీ తాను సీఎం జగన్‌ తోనే ఉన్నానని.. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నానని చెప్పడమేంటని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా రాపాక వరప్రసాద్‌ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాను సర్పంచ్‌ గా దొంగ ఓట్లుతో గెలిచానని రాపాక బాంబుపేల్చారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్‌ బూత్‌ లో తనకు దొంగ ఓట్లు పడేవని తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేసేసేవారన్నారు. దీంతో తనకు చింతలమోరి గ్రామంలో ఏడు నుంచి ఎనిమిది వందల వరకు మెజారిటీ వచ్చేదంటూ.. అదేదో ఘనకార్యమన్నట్టు రాపాక వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తనకు రూ.10 కోట్లు ఆఫర్‌ చేసినా వెళ్లలేదని.. విలువలకే కట్టుబడ్డానన్న రాపాక వ్యాఖ్యలకు.. ఇప్పుడు ఈ వీడియో క్లిప్‌ వ్యాఖ్యలు పొంతన లేకుండా ఉన్నాయంటున్నారు. అసలు రాపాకకు అంత సీనుందా? సొంత గ్రామంలోనే అధికార పార్టీలో ఉండి సర్పంచ్‌ ను గెలిపించుకోలేని ఆయనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్‌ చేస్తుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అధికార వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్‌ మేరకు ఆడమన్నట్టుల్లా ఆయన ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.