Begin typing your search above and press return to search.

గద్వాల్ జిల్లా కోసం డీకే రాజీనామా బ్రహ్మాస్త్రం

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:12 AM GMT
గద్వాల్ జిల్లా కోసం డీకే రాజీనామా బ్రహ్మాస్త్రం
X
కొత్త జిల్లాలతో తిరుగులేని రాజకీయ పక్షంగా అవతరించేలా ప్లాన్ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇబ్బంది కలిగించేవే. కొత్త జిల్లాల ఏర్పాటు సాఫీగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయని ఆయన భావించారు. అయితే.. ఆయన వేసుకున్న లెక్కలకు భిన్నంగా భారీగానే రచ్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ వాదనను విపక్షాలు కొంతమేర సమర్థించినా.. జిల్లా సరిహద్దుల విషయంలోనూ.. కొత్త జిల్లాల విషయంలోనూ అభిప్రాయ బేధాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పక తప్పదు. అన్నింటికి మించి.. శంషాబాద్ జిల్లా ఏర్పాటు.. మొదట ఓకే చేసి తర్వాత మార్చిన సిరిసిల్ల జిల్లా వ్యవహారంతో పాటు.. వరంగల్.. హన్మకొండ ను రెండుగా చేయటంపైనా.. గద్వాల్ ను కొత్త జిల్లాగా ప్రకటించకపోవటం లాంటి అంశాలపై రభస ఎక్కువగానే జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు వినిపించని నిరసన గళం ఆ తర్వాత పుంజుకోవటం.. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోల వరకూ వెళ్లింది. ఇక.. తెలంగాణ రాజకీయ జేఏసీ చీఫ్ కోదండరాం అయితే ఏకంగా కొత్త జిల్లాల ఏర్పాటు చట్టబద్ధం కానే కాదని తేల్చేశారు. మరోవైపు.. కొత్త జిల్లాలపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినంతనే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు షురూ అయ్యాయన్న వాదన ఉంది. ఇదిలా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లో దసరా రోజు నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి తాను అనుకున్న రీతిలో తప్పించి.. ప్రజల మనోభావాల్ని పట్టించుకోవటం లేదన్న ఆగ్రహంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ భారీ నిర్ణయాన్నే తీసుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి గద్వాల్ జిల్లాగా ఏర్పడాలన్న తన ప్రాంత ప్రజల కోసం ఆమె పెద్ద నిర్ణయాన్నే తీసుకున్నారు. తన కారణంగా కేసీఆర్.. గద్వాల్ జిల్లాను ప్రకటించటం లేద‌ని ఆరోపిస్తున్న ఆమె.. గ‌ద్వాల్ జిల్లా కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

శుక్రవారం తన అనుచరులతో భేటీ అయిన ఆమె.. జిల్లా ఏర్పాటు కోసం మొదటి నుంచి తాము పోరాడుతున్నా.. తాను ఉన్నకారణంగానే కేసీఆర్ గద్వాల్ జిల్లాను ఏర్పాటు చేయటం లేదన్న విషయం తనకు తెలిసిందని.. తన వల్లే కొత్త జిల్లా రాకుండా ఆగుతున్న వేళ.. తనకు పదవి అక్కర్లేదంటూ ఆమె రాజీనామా అస్త్రాన్ని సంధించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. శనివారం ఆమె స్పీకర్ మధుసూదనాచారికి తన రాజీనామా లేఖను పంపుతారని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కేసీఆర్ ఎదుర్కొనే అతి పెద్ద సవాల్... డీకే అరుణ రాజీనామా అస్త్రంగానే ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.