Begin typing your search above and press return to search.

ప్ర‌జారాజ్యం పేరుతో తిట్టేసిన తెలుగు త‌మ్ముడు

By:  Tupaki Desk   |   1 July 2018 11:08 AM GMT
ప్ర‌జారాజ్యం పేరుతో తిట్టేసిన తెలుగు త‌మ్ముడు
X
మొన్న‌టి వ‌ర‌కూ మిత్రుడు.. ఈ మ‌ధ్య‌నే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా మారిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తెలుగు త‌మ్ముళ్లు విరుచుకుప‌డుతున్నారు. ఏ చిన్న అవ‌కాశం ల‌భించినా.. వారు ప‌వ‌న్ పై పెద్ద ఎత్తున మండిప‌డుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరారు పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు స‌త్యానార‌య‌ణ‌.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న ప‌వ‌న్ తీరును మండిప‌డిన ఆయ‌న‌.. ప‌వ‌న్‌ రాజ‌కీయాల్లోకి కొత్తగా రాలేద‌ని.. ఆయ‌న అన్న పార్టీలో ప‌ని చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ప్ర‌జారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంత‌కు అమ్మేశారో అంద‌రికీ తెలుసంటూ ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన త‌ర్వాత కూడా బీజేపీని కానీ ప్ర‌ధాని మోడీని కానీ ప‌ల్లెత్తు మాట ఎందుకు అన‌టం లేద‌న్న ఆయ‌న‌.. ప‌వ‌న్ తీరు చూస్తుంటే బీజేపీ స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్న‌ట్లుగా ఉంద‌ని ఎద్దేవా చేయ‌టం గ‌మ‌నార్హం. విశాఖ‌లో మూడు నెల‌లుగా ఉంటున్న ప‌వ‌న్.. విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు పోరాటం చేయ‌టం లేదని ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్ సినిమాల్లోనే న‌టించాల‌ని కానీ రాజ‌కీయాల్లో కాదంటూ ఎద్దేవా చేసిన బండారు.. పాలిటిక్స్ లో కేవ‌లం వాస్త‌వాలు మాత్ర‌మే మాట్లాడాల‌న్నారు. కేంద్రంపై విమ‌ర్శ‌లు చేయ‌కుండా కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం మీద‌నే విమ‌ర్శ‌లు చేయ‌టం ఏమిట‌న్న ఆయ‌న‌.. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై ప్ర‌జ‌ల్ని ప‌వ‌న్ రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చ‌గొడుతూ అశాంతిని సృష్టించ‌కూడ‌ద‌న్నారు.ఉత్త‌రాంధ్ర‌లో ఏపీ స‌ర్కారు చేసిన అభివృద్ధి క‌న‌ప‌ట్లేదా? అని ప్ర‌శ్నించారు.