Begin typing your search above and press return to search.

ఫోటో కోసం ఆ కోట్లాటేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   28 Feb 2016 5:21 AM GMT
ఫోటో కోసం ఆ కోట్లాటేంది కేసీఆర్?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ అధికారపక్షం నేతల మధ్య చోటు చేసుకున్న గ్రూపు తగాదాలు ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు కొట్టుకునే వరకూ వెళ్లటమే కాదు.. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లటం సంచలనంగా మారింది. పార్టీని రోజురోజుకీ విస్తరిస్తున్న కేసీఆర్ కు తాజా ఘటన ఒక హెచ్చరికగా మారిందని చెప్పొచ్చు.

పార్టీని విస్తరించటం ఓకే అయినా.. ఆ తొందరలో పార్టీలో గ్రూపులు పెరిగిపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న వివాదంలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిల మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు.

శనివారం నిజామాబాద్ మండల పరిధిలోని కాలూర్ గ్రామంలో మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫోటో లేదన్న ప్రశ్నను ఆయన వర్గీయులు గట్టిగా నిలదీయటం.. ఇది కాస్తా వివాదం మారింది. తననుప్రశ్నించటాన్ని తట్టుకోలేని ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రశ్నించిన నాయకుడిపై చేయి చేసుకోవటంతో ఎమ్మెల్సీ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ రచ్చ మరింత పెరిగిపోయి.. ఇరువురు నేతలకు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్లు అడ్డుకొని విడదీయటంతో పెద్ద కొట్లాట తప్పిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వర్గీయులు ధర్నా.. ఆందోళనలు చేపట్టారు. ఇక.. ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ కేసు పెడితే.. ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే వర్గీయులు కేసు పెట్టేశారు. అధికారపార్టీకి చెందిన ఇరువురు నేతలు బాహాటంగానే ఇంతగా బరి తెగించటం.. ఇరువురి మధ్య విభేదాల కారణంగా చోటు చేసుకున్న రచ్చపై ఆర్ఎస్ వర్గాలు విస్మయానికి గురి అవుతున్నాయి.

ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. క్రమశిక్షణారాహిత్యంతో పాటు.. నేతల మధ్య ఇంత బరితెగింపు ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఫ్లెక్సీ మీద ఫోటో వేయకపోవటం.. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైఖరి మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో..?