Begin typing your search above and press return to search.

తిట్టినా, తన్నినా జగన్‌ తోనే: పార్టీ మార్పు వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   18 May 2023 7:45 PM GMT
తిట్టినా, తన్నినా జగన్‌ తోనే: పార్టీ మార్పు వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే!
X
రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్‌ తోనే ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. తనను తిట్టినా, తన్నినా, తన వల్ల పార్టీకి నష్టమన్నా కూడా తాను సీఎం జగన్‌ కోసమే పనిచేస్తానని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు తన బాబాయి, నెల్లూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ తో విభేదాల నేపథ్యంలో తాను పార్టీ మారతానని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టత ఇచ్చారు.

ఎవరితోనైనా తనకు సెట్‌ కాకుంటే వారికి దూరంగా ఉంటానని అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. తనకు కొందరితో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. పెళ్లికి వెళ్లి అక్షింతలు వేస్తూ ఆ తాడు తెగాలని మనసులో కోరుకునేకంటే పెళ్లికి వెళ్లకపోవడం మంచిదని వ్యాఖ్యానించారు. పక్కపక్కన కూర్చుని వీడు ఎప్పుడు నాశనమైపోతాడా అనే ఎదురుచూసేకంటే వారికి దూరంగా ఉండటం మంచిదన్నారు.

ఒకరి మీద చాడీలు చెప్పే మనస్తత్వం తనది కాదని అనిల్‌ వెల్లడించారు.ఏడాది నుంచి తాను మిన్నకున్నానని తెలిపారు. ఇప్పుడు జగన్‌ వద్ద ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటపెడతానన్నారు. జగన్‌ అన్నని తాను ఏ విషయంలోనైనా ఒప్పించుకోగలనని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ తనకు ఒక పెద్ద వ్యసనమని చెప్పారు. అనిల్‌... నువ్వు ఇక్కడ పోటీ చేయొద్దు.. ఓడిపోతావంటే గమ్మున ఉంటానని తెలిపారు. బిడ్డ మీద తండ్రి కోప్పడడా... అన్న మీద తమ్ముడు కోప్పడడా? అలా కోప్పడటం లేదంటే అది ఫేక్‌ అని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ఎవరో కొంతమంది ఫేక్‌ గాళ్ళు.. ఫేక్‌ వార్తలతో అసత్య ప్రచారాలకు దిగినంత మాత్రాన తనకు జరిగే నష్టమేమీ లేదని అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. తన పేరును వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటూ.. సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తానని తెలిపారు. తన తండ్రి వర్ధంతి నాడు ఆయన సాక్షిగా చెప్తున్నానని.. రాజకీయాలలో ఉన్నంతవరకు జగనన్నతోనే ప్రయాణమని వెల్లడించారు.

జగనన్న తనను తరిమేసే పరిస్థితి ఎప్పటికీ రాదని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ వచ్చినా.. తుది శ్వాస వరకు జగనన్న కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. పేరుపొందిన గొర్రెలతో కలిసి గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండడం మంచిది అనే సామెతను బాగా విశ్వసిస్తానని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

మోకాలి సమస్య కారణంగా చికిత్స కోసం 15 రోజులు పాటు నెల్లూరుకు దూరంగా ఉండబోతున్నానని వెల్లడించారు. మీడియా దానిని వక్రీకరించి తాను జగన్‌ కు దూరమవుతున్నానంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అది జగన్‌ భిక్ష అని వెల్లడించారు.