Begin typing your search above and press return to search.

దిశ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

By:  Tupaki Desk   |   10 Feb 2020 9:30 AM GMT
దిశ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
X
ఆంధప్రదేశ్ ప్రభుత్వం మహిళలు - బాలికల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చి అనంతరం దిశ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. మహిళలకు సంబంధించిన సమస్యలపై పోలీసులు చర్యలు తీసుకుని వారికి అండగా నిలబడేందుకు ఈ పోలీస్ స్టేషన్లు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయగా ఆ ఠాణాలో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన అసభ్యకరమైన కామెంట్లు వస్తున్నాయని - వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని రాజమండ్రి దిశ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

తనపై సోషల్ మీడియాలోఅసభ్యకర కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటూ టీడీపీ నేతలు - కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ కు తరలివచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం దిశ పోలీస్ స్టేషన్ దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై గతంలోనే ఎమ్మెల్యే భవానీ స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు - కామెంట్లు పెడుతున్నారని చాలా రోజులుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. వీటిపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, ఈ విషయాన్ని గతంలోనే అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ఓ ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతున్నారు.