Begin typing your search above and press return to search.

మన ‘అందమే’ జపాన్ కు ఇప్పుడు అండ

By:  Tupaki Desk   |   7 Sep 2016 5:35 AM GMT
మన ‘అందమే’ జపాన్ కు ఇప్పుడు అండ
X
నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే లోపు ఏదో ఒక సందర్భంలో జపనీయుడి వస్తువు వాడందే పొద్దు పొడవదు. దశాబ్దాలు గడిచినా జపానోడి మీద ఆధారపడటమే కానీ.. జపానోడు మనమీద ఆధారపడే పరిస్థితి ఇప్పటివరకైతే రాలేదు. కానీ.. మన సంతతి అమ్మాయి పుణ్యమా అని మన అందం.. జపాన్ అందంగా మారిన చిత్రమైన పరిస్థితి. భారత మూలాలు ఉన్న అందాల భామ.. 22 ఏళ్ల ప్రియాంక యోషికవా మిస్ జపాన్ గా ఎన్నికైంది. ప్రియాంక తండ్రి భారతీయుడైతే.. తల్లి జపనీయురాలు. జపనీయురాలిగా కనిపించినా భారతీయ అందం ఆమెలో ఉట్టిపడటంతో ఆమె ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ప్రియాంక అందాల పోటీకే పరిమితం అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

ఎందుకంటే.. ఆమె ఏనుగుల శిక్షకురాలిగా అధికారికంగా అనుమతి పొంది ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పాలి. ర్యాంప్ మీద మెరుపులుమెరిపించే ప్రియాంక.. మొండి గజరాజుల్ని తన దారికి తెచ్చుకునే నేర్పు ఆమె సొంతం. తాజాగా జరిగిన మిస్ జపాన్ పోటీలో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. డిసెంబరులో వాషింగ్టన్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలో జపాన్ కు నేతృత్వం వహించనున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ ప్రపంచ వేదికల మీద జపాన్ నుంచి ఇతర జాతి మూలాలున్న ముద్దుగుమ్మలు పోటీ పడింది లేదు. ఆ అరుదైన ఘనత కూడా ప్రియాంక సొంతమైంది. మరి.. ఆమెకు భారత్ కు ఉన్న అనుబంధాన్ని చూస్తే మరికొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. టోక్యోలో పుట్టిన ఈ భామ.. ఏడాది పాటు భారత్ లోనే ఉంది. పదేళ్ల వయసులో జపాన్ కు వెళ్లిన ఆమెకు.. విదేశీ మూలాలున్న తన లాంటి జపనీయులకు చాలానే అవమానాలు ఎదురవుతాయని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. ఇతర దేశాల మూలాలున్న వారిని తాకితేనే మైల పడిపోయినట్లుగా ఫీలయ్యే జపనీయులతో పాటు.. తనను అవమానించినోళ్లుచాలామందే ఉన్నట్లు చెప్పినప్పుడు.. ఇప్పుడు అదే అమ్మాయి ఆ దేశ అందంగా అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం వహించటం గొప్పగా అనిపించక మానదు. ‘మన’ అందం ఇప్పుడు జపనీయుడి అందంగా మారటం మనందరికి అనందమే. సో.. ఈసారి మిస్ వరల్డ్ పోటీలో భారతీయుల మద్దతు ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉంటుందన్నమాట.