Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల ఎర కేసుపై హైకోర్టు తాజా తీర్పుతో ఏం కానుంది?

By:  Tupaki Desk   |   6 Feb 2023 3:02 PM GMT
ఎమ్మెల్యేల ఎర కేసుపై హైకోర్టు తాజా తీర్పుతో ఏం కానుంది?
X
తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎర వేసిన వైనంపై బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హడావుడి చేయటం.. దీనికి సంబంధించిన ఎపిసోడ్ లో బీజేపీ అడ్డంగా బుక్ అయ్యిందన్న వాదనలు వినిపించటం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి అంశాలపై బీజేపీ అధినాయకత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ.. ఆ పార్టీ మాత్రం ఆచితూచి అన్నట్లుగా రియాక్టు కావటం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానం కాదని పేర్కొంటూ.. సీబీఐకి అప్పగించాలని చెప్పటం తెలిసిందే.

దీంతో.. ఈ కేసును సీబీఐకి అప్పచెప్పొద్దంటూ కేసీఆర్ సర్కారుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. సీబీఐకి ఇవ్వకూడదనటంలో ఎలాంటి విషయం లేదంటూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పు పడుతూ.. ధర్మాసనానికి అప్పీలుకు వెళ్లారు.

తాజాగా ఈ ఉదంతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తాము తప్పు పట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ హైకోర్టు ధర్మాసనం పిటిషన్ ను కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. జస్టిస్ ఎన్. తుకారం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేయటం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని తప్పు పట్టలేమని పేర్కొంది. దీంతో.. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేని పరిస్థితి నెలకొంది.

అయితే.. ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ చేతికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ సర్కారు.. కనీసం తాజాగా ఇచ్చిన తీర్పును పదిహేను రోజులు అమలు కాకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో.. ఇప్పుడేం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. అప్పీలుకు సుప్రీంకు వెళ్లేందుకు సమయం లేకపోవటం.. ఎందుకంటే తాజాగా ధర్మాసనం ఇచ్చిన తీర్పు వెంటనే అమల్లోకి వస్తుంది కాబట్టి.. ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోతుంది.

అదే జరిగితే తమకు సమస్యలు తప్పవన్న ఆందోళనలో కేసీఆర్ సర్కారు ఉందంటున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన ఆధారాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు.. హైకోర్టులకుపంపిన వైనంపై ఇప్పటికే న్యాయస్థానాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు తమ వద్దకొచ్చిన ఆధారాల్ని చట్టబద్ధంగా ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్లాలే తప్పించి.. ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి ప్రకటించటం.. సుప్రీం.. హైకోర్టులకు పంపటం సరికాదన్న మాట వినిపిస్తోంది.

ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళితే.. అసలు ఆధారాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఎవరు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? దీనికి బాధ్యులు ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన రావటంతో పాటు.. మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయన్న మాట వినిపిస్తోంది. అందుకే.. సుప్రీంకు అప్పీలుకు వెళ్లాలన్న పట్టుదలతో కేసీఆర్ సర్కారు ఉన్నప్పటికీ.. తాజా పరిణామాల నేపథ్యంలో అది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడేం అవుతుందన్నది ఉత్కంటగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.