Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డిని పట్టించిన ఎమ్మెల్యే భూఆక్రమణ!?

By:  Tupaki Desk   |   14 Jun 2021 7:30 AM GMT
రేవంత్ రెడ్డిని పట్టించిన ఎమ్మెల్యే భూఆక్రమణ!?
X
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఏసీబీకి పట్టించి వార్తల్లో నిలిచిన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పై తాజాగా ఓ బాధితుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తన భూమిని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కబ్జా చేశాడని ఆరోపించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వికారాబాద్ జిల్లా పూడూరుకు చెందిన నర్సింహులు అనే రైతు ఈ మేరకు స్టీఫెన్ సన్ పై ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాపోయాడు. పూడూరులోని సర్వే నంబర్ 202లో తనకు చెందిన 3.10 ఎకరాల భూమి ఉందని రైతు నర్సింహులు తెలిపాడు.. ఆ భూమికి సంబంధించి 2015లో స్టీఫెన్ ఆగ్రిమెంట్ చేసుకున్నానన్నాడు. ఈ క్రమంలోనే 1.25 ఎకరాలను ఆయన కుమార్తె జెస్సికా పేరుతో రిజిస్ట్రర్ చేయించారని తెలిపారు. మిగతా భూమి తన పేరిటనే ఉందని నర్సింహులు తెలిపాడు.

ఇక మిగిలిన భూమిని విక్రయించాలంటూ స్టీఫెన్ సన్ నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని నర్సింహులు తెలిపాడు. దానికి తాను అంగీకరించలేదన్నాడు.. ఈలోగా ఉపాధి కోసం వ్యవసాయం భూమిని వదిలి హైదరాబాద్ వెళ్లి పనిచేసుకున్నట్టు వివరించాడు. ఈనెల 8న స్టీఫెన్ సన్ మనుషులు తన భూమిని చదును చేసినట్లు తెలుసుకొని సొంత ఊరికి వచ్చినట్టు బాధితుడు వాపోయాడు.

ఈనెల 9న చన్ గోలు పోలీసులకు స్టీఫెన్ సన్ పై ఫిర్యాదు చేసినట్టు బాధితుడు నర్సింహులు మీడియాకు తెలిపాడు. తన భూమిని ఆక్రమించిన స్టీఫెన్ సన్ పైనా.. అతడి అనుచరులపైనా చర్యలు తీసుకోవాలని కోరానన్నారు.

కాగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్సై వివరణ ఇచ్చారు.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.