Begin typing your search above and press return to search.

బాబు హ‌ర్టయినా, కేసీఆర్ హ‌ర్ట్ అయినా బాబుకే చేటు!

By:  Tupaki Desk   |   9 May 2018 4:29 PM GMT
బాబు హ‌ర్టయినా, కేసీఆర్ హ‌ర్ట్ అయినా బాబుకే చేటు!
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయ‌న జూనియ‌ర్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనూహ్య రీతిలో టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బాబు అడ్డంగా బుక్క‌యిన ఓటుకునోటు కేసులో ఆయ‌న క‌ల‌వ‌రానికి గుర‌య్యే స్కెచ్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ద్వారా భారీ నాటకానికి తెరతీయడం, తెలంగాణ ఏసీబీ ఛేదించడం, ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉండ‌టం తెలిసిన సంగ‌తే. అయితే దీన్నితాజాగా కేసీఆర్ మ‌ళ్లీ క‌దిపారు. ప్ర‌త్యేక క‌మిష‌న్ వేసి విచార‌ణ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా బాబు హయాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను మొత్తం తేల్చాల‌ని కేసీఆర్ డిసైడ‌య్యారు. అయితే ఇంత‌గా కేసీఆర్ మండిప‌డేందుకు కార‌ణం..అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా ఎన్నిక‌లు తెర‌మీద‌కు రావ‌డ‌మా? టీడీపీని ఇర‌కాటంలో ప‌డేయ‌డమా? అంటే అవేమీ కాద‌ని...చంద్ర‌బాబు నోరుజార‌డ‌మని పొలిటిక‌ల్ మీడియా స‌ర్కిల్లో కొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రచారం లో నిజం ఎంత ఉందొ కానీ హైదరాబాద్ మీడియా సర్కిల్స్ లో తెగ మాట్లాడుకుంటున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వ‌డం,ఈ క్ర‌మంలో ప‌లువురు నేత‌ల‌తో భేటీ అవ‌డం తెలిసిన సంగ‌తే. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడ‌లేద‌ని, అయితే త‌న ఫ్రెండ్ అయిన బాబుతో చ‌ర్చిస్తాన‌ని వెల్ల‌డించ‌డం తెలిసిన సంగ‌తే. ఈ కామెంట్ల‌పై బాబు హ‌ర్ట‌య్యార‌ట‌. సీనియర్ అయిన తనను ఫ్రెండ్ అని చెప్పడం బాబును బాధించింద‌ట‌. 1997 నుంచి 99 వరకు తన దగ్గర మంత్రి వర్గంలో పనిచేసిన కేసీఆర్ తనను ఫ్రెండ్ గా మాత్రమే సంబోధించడం చంద్రబాబుకు నచ్చలేదట. దీంతో ఈ కామెంట్లు చేసిన కొద్దికాల‌నికి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు..తన అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. ​

ఈ కామెంట్ల‌న్నీ కేసీఆర్ దృష్టికి చేర‌డంతో ఆయ‌న భ‌గ్గుమ‌న్నార‌ని స‌మాచారం. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు అనేక డ్రామాలాడుతున్నాడ‌ని స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. దీంతో తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు కేసులో ఛేదించిన మొత్తం వివ‌రాలు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించార‌ట‌. అంతేకాకుండా బాబుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌న్నింటి వివ‌రాలు ఇవ్వాల‌ని కేసీఆర్ ఆదేశించార‌ని స‌మాచారం.

చంద్రబాబునాయుడు పదవినుంచి దిగిపోతూ, అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ భూములను అప్పనంగా పందేరం చేశారన్న ఆరోపణలుండ‌టం, వీటిపై పక్కా ఆధారాలతో ఏసీబీ - సీఐడీ, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు కేసులు పెట్టిన నేప‌థ్యంలో వాటి సంగ‌తి తేల్చాల‌ని కోరారు.​ ​అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 26,634 ఎకరాల భూములను వివిధ కంపెనీలకు ఇస్తే వీటిలో సుమారు 10వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కలవే కావడం గమనార్హం. వాస్తవానికి అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోరాదనే నిబంధన ఉన్నా.. ఉల్లంఘించారు. దీన్ని ప్రశ్నిస్తూ అనేకమంది కోర్టులను ఆశ్రయించారు. నేటికీ కేసులున్నాయి. వాటిని బ‌య‌ట‌కు తీసి దుమ్ము దుల‌పాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు. అయితే, ఇదంత వ‌ర‌కు నిజ‌మో కాలం గ‌డిస్తే గాని చెప్ప‌లేం. ఒక‌వేళ ఇదే నిజ‌మ‌యితే.... కేవలం *ఫ్రెండ్‌* అనే మాట ఇంత దూరం తీసుకెళ్లిందంటే.. ఆశ్చ‌ర్య‌మే అని చెప్పొచ్చు!