Begin typing your search above and press return to search.

తెలంగాణ ఉద్య‌మ సూత్రాన్ని మ‌రిచారా కేసీఆర్‌

By:  Tupaki Desk   |   11 May 2018 5:58 AM GMT
తెలంగాణ ఉద్య‌మ సూత్రాన్ని మ‌రిచారా కేసీఆర్‌
X
తెలంగాణ ఉద్య‌మం ఎందుకు వ‌చ్చింది? అన్న‌ది మూడు ముక్క‌ల్లో చెప్ప‌మంటే.. నీళ్లు.. నిధులు.. నియ‌మ‌కాలు. ఈ మూడింటిలోనూ కామ‌న్ ఏమిటంటే.. మాది(తెలంగాణ‌) మాకు కాకుండా మీరెందుకు (ఏపీ) వాళ్ల‌కు ఇవ్వాల‌న్న‌దే క‌నిపిస్తుంది. తెలుగోళ్లంతా ఒక్క‌టే అయినా.. లెక్క‌ల విష‌యంలో మాత్రం కాద‌న్న‌ది కేసీఆర్ సిద్దాంతం. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ నేప‌థ్యంలో దేవెగౌడ మీటింగ్ కోసం క‌ర్ణాట‌క‌కు వెళ్లిన కేసీఆర్‌.. తెలుగోళ్లంతా క‌లిసి జేడీఎస్ కు ఓటేయాల‌ని చెప్పారు. అప్పుడేమీ ఆంధ్రా.. తెలంగాణ అన్న తేడా లేకుండా తెలుగోళ్లంతా ఒక్క‌టిలా క‌నిపించారు.

ఇప్పుడా విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాను ఏదైతే విభ‌జ‌న సిద్దాంతాల్ని రూపొందించి.. కోట్లాది మందిని క‌దిలించి మ‌రీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో.. ఇప్పుడు అదే రాష్ట్రంలో ఒక ప్రాంతానికి చెందిన వ్య‌క్తిని మ‌రో ప్రాంతానికి చెందిన ప‌ద‌విలో కూర్చోబెట్ట‌టం కేసీఆర్ సొంత పార్టీలోనే అసంతృప్తికి గురి చేస్తోంది.

లోక‌ల్‌.. నాన్ లోక‌ల్ అన్న ఫీలింగ్ ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా లేకున్నా.. పార్టీలో మాత్రం ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ మ‌ధ్య‌న సీఎం కేసీఆర్ త‌న క్లోజ్ ఫ్రెండ్ అయిన బొమ్మెర వెంకటేశంకు కాళేశ్వ‌ర ఆల‌య ఛైర్మ‌న్ గా ఎంపిక చేయ‌టం తెలిసిందే. డైరెక్ట‌ర్ పోస్టు కోరితే.. ఏకంగా ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌టం చాలామందికి విస్మ‌యానికి గురి చేసింది. ఈ త‌ర‌హా సినిమాటిక్ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే చెల్లు అని చాలామంది అనుకున్నా.. ఈ నిర్ణ‌యంతో పార్టీలో అసంతృప్తి ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కాళేశ్వ‌రం ఆల‌య క‌మిటీలో ప‌ద‌వులు ఆశించిన స్థానిక నాయ‌కుల‌కు చేయిస్తూ.. పెద్ద ప‌ద‌వి కేసీఆర్ స్నేహితుడికి వెళ్ల‌టాన్ని స్థానిక నేత‌లు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కేసీఆర్ కు జానీ జిగిరి స్నేహితుడే అయిన‌ప్ప‌టికీ.. త‌మ బంగారు పుట్ట‌లో వేలెడితే ఒప్పుకుంటామా? అన్న చందంగా మండిప‌డుతున్నారు. కేసీఆర్ స్నేహితుడే కాదు.. కేసీఆర్ పైనా వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.కేసీఆర్ నిర్ణ‌యం నేప‌థ్యంలో టీఆర్ ఎస్ కు చెందిన నాయ‌కులు ప‌లువురు త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేయ‌టం విశేషం.

మెద‌క్ జిల్లా వాసిని తీసుకొచ్చి జ‌య‌శంక‌ర్ జిల్లాలోని టెంపుల్ కు ఛైర్మ‌న్ ను ఎలా చేస్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ ఫాలోయ‌ర్స్ గా వారు.. ఆ పాయింట్ ను ప్ర‌శ్నించ‌టం త‌ప్పేం కాదు క‌దా. తెలంగాణ ఉద్య‌మానికి కీల‌క‌మైన లోక‌ల్‌.. నాన్ లోక‌ల్ అన్న‌దాన్ని తాజా ఎపిసోడ్ లో కేసీఆర్ ఎలా మ‌ర్చిపోతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఎంత కేసీఆర్ స్నేహితుడైతే మాత్రం స్థానికేత‌రుడ్ని తీసుకొచ్చి ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కాళేశ్వ‌రం ఆల‌య క‌మిటీ నియామ‌కాల నేప‌థ్యంలో పార్టీలో ర‌గిలిన అసంతృప్తిని ట‌చ్ చేయ‌టానికి పార్టీ పెద్ద‌లు ఎవ‌రూ సాహసించ‌లేక‌పోతున్నారు. ఇష్యూ కేసీఆర్ ది కావ‌టం.. ఈ ఇష్యూ ఎటువెళ్లి ఎక్క‌డికి వ‌స్తుంద‌న్న సందేహం వారిని వెంటాడుతోంది. మొత్తానికి.. త‌న స్నేహితుడి కోసం లోక‌ల్ ను కాద‌ని నాన్ లోక‌ల్‌ కు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టుడు ఏంది కేసీఆర్ అంటూ ప్ర‌శ్నిస్తున్న దానిపై స‌మాధానం చెప్పేందుకు క‌రుడుగ‌ట్టిన టీఆర్ఎస్ నేత‌లు సైతం మాట్లాడ‌లేని ప‌రిస్థితి.