Begin typing your search above and press return to search.

సారుకు యాడ్ నివాళి అక్క‌ర్లేదా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   7 Aug 2018 6:24 AM GMT
సారుకు యాడ్ నివాళి అక్క‌ర్లేదా కేసీఆర్‌?
X
అదేం సిత్ర‌మో కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల‌కు కొన్ని విష‌యాలు సేమ్ టు సేమ్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌మ‌ను తాము ప్ర‌చారం చేసుకోవ‌టం కోసం భారీగా యాడ్స్ ఇవ్వ‌టం ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు ఇష్టం. త‌మ‌ది తెలంగాణ రాష్ట్రమ‌ని.. త‌మ‌కు మాత్ర‌మే స‌రిపోయే ప్ర‌క‌ట‌న‌ల జోరును ఏపీలో కూడా వేయించే వైఖ‌రి కేసీఆర్ లో క‌నిపిస్తుంది. ఈ విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా త‌క్కువ తిన‌లేద‌నుకోండి.

ప్ర‌తి చిన్న విష‌యంలోనూ. భారీ ప్ర‌చారాన్ని కోరుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. త‌న రాజ‌కీయ మైలేజికి కార‌ణ‌మ‌య్యే ఏ అంశాన్ని వ‌దిలి పెట్ట‌ర‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో షురూ చేసి.. ఒక కొలిక్కి తీసుకొచ్చిన ప్రాజెక్టుల‌కు మార్పులుచేర్పులు చేసి త‌మ ఘ‌న‌త‌గా గొప్ప‌లు చెప్పుకునే వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ సంద‌ర్భంలోనూ భారీ ఎత్తున ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకోవ‌టం తెలిసిందే.

అంతేనా.. కొన్ని కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి అవ‌స‌రానికి మించిన ప్ర‌చారం.. కోట్లాది రూపాయిల ఖ‌ర్చుకు సైతం వెనుకాడ‌ని తీరు క‌నిపిస్తుంది. ప్ర‌భుత్వ ప్ర‌గ‌తిని గొప్పలు చెప్పుకోవ‌టానికి జాకెట్ యాడ్ల‌ను ఇవ్వ‌ట‌మే కాదు.. త‌మ‌ది కాని ఏపీలో ప‌బ్లిష్ అయ్యే ప‌త్రిక‌ల్లోనూ యాడ్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రు.

మ‌రిన్ని విష‌యాల‌కు చేతికి ఎముక లేన‌ట్లుగా ఖ‌ర్చు చేసే సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌కు సంబంధించిన సిద్ధాంతానికి క‌ర్మ‌.. క‌ర్త‌.. క్రియ లాంటి ఆచార్య కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ జ‌యంతిని ఎలా నిర్వ‌హించిందో చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఈ రోజున తెలంగాణకు కార‌ణం.. జ‌య‌శంక‌ర్ సార్ సిద్ధాంత ప్ర‌భావ‌మే. ఆయ‌న క‌ల‌కు కేసీఆర్ లాంటి నేత సైతం స్ఫూర్తి పొందార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. అలాంటి సార్ పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు గుర్తుంచుకునే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించ‌టం.. భారీ ఎత్తున కార్య‌క్ర‌మాలు.. వేడుక‌లు.. ఎందుకు చేప‌ట్ట‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. త‌న పుట్టిన రోజున.. త‌న కొడుకు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప‌త్రిక‌ల్లో యాడ్స్ ఇచ్చే అనుచ‌ర గ‌ణం జ‌య‌శంక‌ర్ సార్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ఒక్క యాడ్ కూడా ఎందుకు ఇవ్వ‌న‌ట్లు?

నాయ‌కులు.. వారి అనుచ‌ర‌గ‌ణాన్ని వ‌దిలేద్దాం.. ప్ర‌భుత్వానికి ఏమైంది. అవ‌స‌ర‌మైన వాటికి.. లేని వాటికి కోట్లాది రూపాయిలు ప్ర‌చారం కోసం ఖ‌ర్చు చేసేట‌ప్పుడు.. జ‌య‌శంక‌ర్ గురించి.. ఆయ‌న ఆశ‌యాల గురించి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా ఎందుకు ప్ర‌య‌త్నించ‌టం లేదు? తెలంగాణ భ‌విష్య‌త్ త‌రాల‌కు జ‌య‌శంక‌ర్ ఆశ‌యాలు.. ఆయ‌న క‌ల‌లు తెలియాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడు మాత్రమే తెలంగాణ నిత్య చైత‌న్యంగా ఉండ‌ట‌మే కాదు.. తెలంగాణ క‌ల సాకారం కోసం త‌నువుల్ని త్యాగం చేసిన వారికి విలువ ఉంటుంది.