Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను క‌ల‌వ‌ర‌పెట్టే మాట‌

By:  Tupaki Desk   |   30 April 2018 7:08 AM GMT
కేసీఆర్ ను క‌ల‌వ‌ర‌పెట్టే మాట‌
X
దెబ్బ మీద దెబ్బ అన్న‌ట్లుగా మారింది మావోల ప‌రిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో త‌మ ఉనికి మ‌రింత విస్తృతం కావ‌టంతో పాటు.. తాము మ‌రింత బ‌లోపేతం అవుతామ‌న్న ఆశ‌లు ఆడియాశ‌లు కావ‌ట‌మే కాదు.. త‌మ ఉనికికే ప్ర‌మాదంగా తెలంగాణ మారుతుంద‌న్న ఆలోచ‌న మావోలు సైతం చేయ‌లేదంటారు.

వ‌రుస పెట్టి సాగుతున్న ఎన్ కౌంట‌ర్లు.. లొంగుబాట్ల కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం మావోల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంద‌ని చెబుతున్నారు. మావోల ఎపిసోడ్‌ లో త‌న ప్రమేయం ఏ మాత్రం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అదే స‌మ‌యంలో కాగ‌ల కార్యాన్ని గంధ‌ర్వులే జ‌రుపుతున్న చందంగా మావోల ఆయువుప‌ట్టును దెబ్బ తీసేలా తెలంగాణ పోలీసులు చేస్తున్న వ్యూహ‌ర‌చ‌న‌తో భారీగా డ్యామేజ్ జ‌రిగింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన భారీ ఎన్ కౌంట‌ర్‌ కు మాస్ట‌ర్ మైండ్ తెలంగాణ పోలీసు వ‌ర్గాలేన‌ని చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న మావో పార్టీ బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు తాజాగా రిక్రూట్ మెంట్ ను షురూ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

రాష్ట్ర క‌మిటీని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి మూడు డివిజ‌న్ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని.. నియామ‌కాల‌కు సంబంధించి ప్ర‌త్యేక బాధ్య‌త‌లు వారికి అప్ప‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. గిరిజ‌నుల మీద ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టిన‌ట్లు చెబుతున్నారు. గ్రామీణ యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌టం.. వారిని ఆక‌ర్షించి పార్టీలోకి తీసుకోవ‌టం ద్వారా ఎన్ కౌంట‌ర్ల ద్వారా జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకోవాల‌ని మావోలు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

తాజా ప‌రిణామం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు క‌ల‌వ‌రానికి గురి చేస్తుంద‌ని చెబుతున్నారు. గ‌తంతో పోలిస్తే.. మావోల వైపు ఆక‌ర్షించే ప‌రిస్థితులు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది. అయితే.. మావోలు ప్ర‌త్యేకంగా టార్గెట్ పెట్టుకొని రిక్రూట్ మెంట్ ను నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఒకింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న ఉద్దేశంలో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు చెబుతున్నారు. మావోల రిక్రూట్ మెంట్ ప్లాన్ కు చెక్ పెట్టేలా తెలంగాణ పోలీసులు త‌గిన వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా స‌మాచారం. ఏమైనా.. గ‌డిచిన కొన్ని నెల‌లుగా త‌మ‌కు జ‌రిగిన న‌ష్టానికి తెలంగాణ ప్ర‌భుత్వం కార‌ణ‌మ‌న్న భావ‌న‌లో మావోల్లో ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. మావోల ఆగ్ర‌హాం రాష్ట్రానికి మంచిది కాద‌న్న మాట ప‌లువురు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చ‌ర్చించుకోవ‌టం క‌నిపిస్తోంది.