Begin typing your search above and press return to search.

40 మంది సిటింగులకు కేసీఆర్ షాక్?

By:  Tupaki Desk   |   25 Dec 2017 4:47 PM GMT
40 మంది సిటింగులకు కేసీఆర్ షాక్?
X
తెలంగాణలోనిక పాలక టీఆరెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త భయం మొదలైంది. అందుకు కారణం - అధినేత - సీఎం కేసీఆర్ స్వయంగా చేయించుకున్న సర్వే రిపోర్టు రావడమేనట. ఆ రిపోర్టు ప్రకారం ఇప్పుడున్న పార్టీ ఎమ్మల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లిస్తే అందులో 40 నుంచి 45 మంది గెలవరని తేలిందట. దీంతో కేసీఆర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని... వారి స్థానంలో కొత్తవారిని ఛాన్సివ్వాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

పార్టీ ఎమ్మెల్యేల తీరు తెన్నులను చాలాకాలంగా గమనిస్తున్న కేసీఆర్ వారిని ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌కు రావొద్దని.. నియోజకవర్గాల్లోనే ఉండాలని, జనం మధ్య ఉండాలని చెబుతూ వచ్చారు. అయినా, చాలామందిలో మార్పు రాకపోవడం... తాజా సర్వే కూడా ఎమ్మెల్యేల పనితీరు బాగులేదని, జనం వారికి ఓట్లేయరని తేల్చడంతో కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇతర పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చారు. వారికి కూడా సీట్లు సర్దుబాట్లు చేయాలి. దీంతో ఈసారి సిటింగులు, గత ఎన్నికల్లో ఓడిపోయినవారిలో కొందరికి కూడా మళ్లీ టిక్కెట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 40 నుంచి 45 మంది సిటింగు ఎమ్మెల్యేలకు గెలిచే సత్తా తాజా సర్వేలో తేలడంతో వారి స్థానంలో ఎవరికి టిక్కెటివ్వొచ్చే తెలుసుకునేందుకు కేసీఆర్ మరో విడత సర్వే చేయించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గాల్లో టీఆరెస్ నేతలు అటెన్షన్ పొజిషన్ లోకి వచ్చేస్తున్నారని... అదృష్టం బాగుంటే తమ ఎమ్మెల్యేను పక్కన పెట్టి తమకే సీటివ్వొచ్చని వారు అనుంగు అనుచరుల్లోనూ కొందరు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారట. తమకు మళ్లీ టిక్కెట్ వస్తుందో రాదో అన్న డౌటు ఉన్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు సొంత అనుచరులను కూడా పక్కలో బల్లేల్లా చూస్తూ భయపడుతున్నారట.